మాలాంటి పేదోళ్లకు గొప్ప అదృష్టం ఇంతకుముందు డయాలసిస్ కోసం హన్మకొండ ప్రైవేట్ దవాఖానకు పోయేది. ఊరు నుంచి 140 కిలోమీటర్ల దూరం. రానుపోను రూ.1300 ఖర్చయ్యేది. నెలకు 9 సార్లు పోతే.. రూ.12 వేలు ఖర్చు. ఇప్పుడు ప్రభుత్వం ఏటూరునాగారంలో డయాలసిస్ కేంద్రం పెట్టింది. మా ఊరు నుంచి 30 కిలోమీటర్లే. గంటసేపట్లో దవాఖానకు పోయి వస్తున్నా. మా పేదోళ్లకు ప్రభుత్వం కల్పించిన గొప్ప అదృష్టం ఇది
– యాలం మునయ్య, బాలన్నగూడెం, మంగపేట మండలం, ములుగు జిల్లా
హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): డయాలసిస్ రోగులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత చికిత్సలో కొత్త మైలురాయిని అధిగమించింది. రాష్ట్రం ఏర్పడిననాటి నుంచి ఇప్పటివరకు డయాలసిస్ రోగులకు చేసిన సెషన్ల సంఖ్య 50 లక్షలు దాటింది. ఇందుకోసం ప్రభుత్వం ఎనిమిదిన్నరేండ్లలో సుమారు రూ.700 కోట్ల వరకు ఖర్చు చేసింది. కిడ్నీ రోగులు వ్యాధి తీవ్రతను బట్టి వారానికి మూడునాలుగు సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే నెలకు కనీసం 10-12 సెషన్లు అవసరమవుతాయి.
 ఉమ్మడి రాష్ట్రంలో డయాలసిస్ 
భారీ ఖర్చుతో కూడుకొన్న వ్యవహారం. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించారు. కిడ్నీ రోగులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా డయాలసిస్ సేవలు అందించాలని నిర్ణయించారు. పెన్షన్లు, బస్‌పాస్‌లు ఇవ్వడం వంటి నిర్ణయాలు రోగుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపాయి.
82కు పెరిగిన డయాలసిస్ కేంద్రాలు 
ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌లో మాత్రమే ఉచిత డయాలసిస్ సేవలు అందేవి. చాలా తక్కువ మందికే ఇక్కడ సేవలు దక్కేవి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రోగులంతా ప్రైవేట్ కేంద్రాలను ఆశ్రయించాల్సి వచ్చేది. చాలా మంది రోగులు అటు ఖర్చు పెట్టలేక, ఇటు హైదరాబాద్‌కు వచ్చి డయాలసిస్ చేయించుకోలేక ఇబ్బందులు పడేవారు. సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు ఈ కేంద్రాల సంఖ్య 82కు పెరిగింది. అంటే సుమారు 28 రెట్లు పెరిగింది. నియోజకవర్గానికి ఒక డయాలసిస్ కేంద్రం ఉండేలా మొత్తం 102 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ప్రసుత్తం రాష్ట్రంలో సుమారు 12 వేల మంది వరకు డయాలసిస్ అవసరమైన కిడ్నీ రోగులు ఉన్నట్టు అంచనా. వీరిలో 10 వేల మంది రోగులు ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా డయాలసిస్ సేవలు పొందుతున్నారు.
సింగిల్ యూజ్డ్ ఫిల్టర్. బస్‌పాస్.. పింఛన్ 
డయాలసిస్ రోగులకు సంబంధించిన ప్రతి సమస్యను సీఎం కేసీఆర్ క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరిస్తున్నారు. గతంలో డయాలసిస్‌లో వాడే ఫిల్టర్లను ఒకరికి మించి వాడేవారు. దీని వల్ల ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ‘సింగిల్ యూజ్’ ఫిల్టర్లు వాడాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఈ విధానం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. తమిళనాడులోనూ ఈ తరహా విధానాన్ని అమలు చేస్తున్నారు. రోగులు డయాలసిస్ కోసం దవాఖానకు వచ్చి వెళ్లేందుకు ఆర్థికభారం పడకుండా దేశంలోనే తొలిసారిగా ఉచిత బస్ పాస్ ఇస్తున్నది. అలాగే, ఆసరా పథకం కింద రూ.2,016 పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐదువేల మందికిపైగా ఈ పింఛన్ పొందుతున్నారు.
ఉచితంగా సర్జరీ.. జీవితాంతం మందులు 
డయాలసిస్ రోగులకు దాత లభించినప్పుడు ఆరోగ్య శ్రీ కింద ప్రభుత్వం ఉచితంగా అవయవ మార్పిడి సర్జరీ చేయిస్తున్నది. నిమ్స్, ఉస్మానియా, గాంధీలో ఏటా 150కిపైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు పూర్తి ఉచితంగా జరుగుతున్నాయి. ఖరీదైన మందులను జీవితాంతం ఉచితంగా అందిస్తున్నారు.
నాలుగేండ్లుగా పైసా ఖర్సు కాలే 
మాది గోదావరిఖని. కూరగాయలు అమ్ముకొని బతికెటోళ్లం. నాలుగేండ్ల కిందట నా రెండు కిడ్నీలు దెబ్బతిన్నయ్. అప్పటి నుంచి కరీంనగర్ సర్కార్ దవాఖాన్లనే డయాలసిస్ చేయించుకుంటున్న. బయట చేయించుకుంటే ఒక్కసారికే 3 వేలు అడుగుతున్నరు. ఇక్కడ ఎన్నిసార్లు చేయించుకున్నా పైసా ఖర్సు కాలేదు. తెలంగాణ సర్కారు అచ్చినంక నా అసొంటి పేదోళ్లకు ఇసొంటి సదుపాయం బెట్టి ఎంతో పుణ్యం కట్టుకున్నది. సర్కారుకు, కేసీఆర్ సారుకు రుణపడి ఉంట.
– ఆకుల బాబు, డయాలసిస్ పేషెంట్
రూ.700 కోట్ల సేవలు పొందారు
కిడ్నీ రోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న డయాలసిస్ సెషన్లు 50 లక్షలు దాటాయి. సీఎం కేసీఆర్ తీసుకొన్న నిర్ణయం ఫలితంగా దాదాపు రూ.700 కోట్ల సేవలను కిడ్నీ రోగులు ఉచితంగా పొందగలిగారు. ఉమ్మడి రాష్ట్రంలో 3 ఉన్న డయాలసిస్ కేంద్రాలను 82కు పెంచారు. నియోజకవర్గానికి ఒక కేంద్రం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రావడం వల్ల, కేసీఆర్ సీఎం కావడం వల్లనే ఇది సాధ్యం అయింది.
-ట్విట్టర్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
దూరాభారం తగ్గింది
ఐదేండ్ల క్రితం హైదరాబాద్ ప్రైవేట్ దవాఖానలో కిడ్నీ పాడయ్యిందని, జీవితాంతం డయాలసిస్ అవసరమని చెప్పారు. నిజామాబాద్ ప్రభుత్వ దవాఖానలో రెండేండ్లు డయాలసిస్ చేయించుకున్నా. ఇప్పుడు బాన్సువాడ ప్రభుత్వ ఏరియా దవాఖానలో చేయించుకుంటున్నా. ఇప్పుడు ఎటూ తిరగాల్సిన పని లేకుండా బాన్సువాడ సర్కారు దవాఖానలనే డయాలసిస్ కేంద్రం పెట్టిన్రు. ఇక్కడనే చేయించుకుంటున్న. మా ఊరు దగ్గర్లకే వచ్చి కష్టం తప్పిచ్చిన్రు. కేసీఆర్ సల్లగా ఉండాలె.
– మదీబాయి, మేడిపల్లి గ్రామం, గాంధారి మండలం, కామారెడ్డి జిల్లా

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం 
ప్రభుత్వ దవాఖానలో డయాలసిస్ సేవలు అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. గతంలో డయాలసిస్ చికిత్స కోసం ప్రైవేట్ దవాఖాన్ల చుట్టూ తిరిగే వాళ్లం. ఇప్పుడు అన్ని సేవలు ప్రభుత్వ దవాఖానలో అందుతున్నాయి. నిరుడు నుంచి ఇక్కడే చికిత్స తీసుకుంటున్నా. వారంలో మూడు సార్లు వచ్చి చికిత్స తీసుకుంటున్న. డాక్టర్ సూచనల మేరకు మందులను వాడుతున్నా. కేసీఆర్ వల్లే ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందుతున్నది. ఇది గ్రామీణ పేదలకు ఎంతో అదృష్టం.
– జల్లబోయిన శ్రావణి, డోర్నకల్
20 నిమిషాల్లో వస్తున్న
మాది మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట దగ్గర్లోని ఎల్లారం. ఎనిమిది నెలల నుంచి ఇక్కడే డయాలసిస్ చేయించుకుంటున్నా. అంతకుముందు రెండు నెలలు కరీంనగర్ పోయిన. కానీ చాలా దూరం. ఇక్కడ చాలా బాగుంది. ఇంటి దగ్గర నుంచి 20 నిమిషాల్లో దవాఖానకు వచ్చి ఓ ఐదు గంటల్లో తిరిగి వెళ్లిపోతున్నా. ఇక్కడ సెంటర్ ఉండడం మాకు ఎంతో ఉపయోగంగా మారింది. మా కష్టాలను అర్థం చేసుకొని పింఛన్ ఇస్తున్న సీఎం కేసీఆర్ పెద్దమనసుకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా.
– లచ్చన్న, లక్షెట్టిపేట, మంచిర్యాల
ఆరు గంటల ప్రయాణం తప్పింది
మాది ఆసిఫాబాద్ జిల్లా అప్పపల్లి గ్రామం. డయాలసిస్ కోసం నిత్యం వరంగల్ పోయేటోడిని. కాగజ్‌నగర్ పోయి అక్కడ ట్రెయిన్ ఎక్కి కూర్చొంటే వరంగల్ పోయేందుకు ఆరు నుంచి ఏడు గంటల సమయం పట్టేది. ఇక్కడ సెంటర్ వచ్చిందని తెలిసి ఏడాదిగా మంచిర్యాలకే వస్తున్నా. వారంలో రెండు రోజుల వైద్యం కోసం వరంగల్ పోయే బాధ తప్పింది. మా బాధలు తెలుసుకొని ఇక్కడ కేంద్రం ఏర్పాటు చేసిన కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
-యశ్వంత్‌రావు, ఆసిఫాబాద్ జిల్లా