నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 24: ఏపీలోని కర్నూల్ జిల్లాలో (Kurnool) ప్రైవేట్ ట్రావెల్స్ బస్ (Private Travels Bus) ప్రమాద దుర్ఘటనలో మెదక్ జిల్లా శివ్యాయిపల్లికి చెందిన తల్లీకూతురు మృతి చెందారు. మెదక్ మండలంలోని శివ్యాయిపల్లికి చెందిన సుధారాణి (43), ఆమె కుమారై చందన (23) బస్సులో సజీవ దహనమైనట్టు బంధువులు తెలిపారు. చందన బెంగళురులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నది. గురువారం సాయంత్రం సంధ్యారాణి తన కూతురు చందనతో కలిసి హైదరాబాద్‌లోని చింతల్ నుంచి ప్రైవేట్ బస్సులో బెంగళూరుకు ప్రయాణమయ్యారు. కూతురు చందనకు తోడుగా వెళ్లి బెంగళూరుకు వెళ్లింది. బస్సు దుర్ఘటనలో సజీవ దహనమయ్యారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన మహేశ్వరం అనూషారెడ్డి( 22) ప్రమాదంలో చనిపోయింది.
అనూషారెడ్డి యాదాద్రి జిల్లా గుండాల మండలం వస్తాకొండూరు గ్రామానికి చెందిన యువతి కాగా, దేవరుప్పుల మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు చదివింది. ప్రస్తుతం బెంగళూరులోని ఆక్సెంచర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నది. దీపావళి పండుగకు గ్రామానికి వచ్చిన అనూష తిరుగు పయనంలో బస్సులో బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అనూషారెడ్డి మృతితో ఆమె స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
బస్సు ప్రమాదంలో ఖమ్మం జిల్లా ముదిగొండ మండలానికి చెందిన ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వల్లభి గ్రామానికి చెందిన చిట్టూరి మేఘనాథ్(25) హైదరాబాద్‌లో నివాసం ఉంటూ.. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. హైదరాబాద్‌కు నుంచి బెంగళూరు వెళ్తున్న క్రమంలో బస్సు ప్రమాదంలో మృతిచెందాడు. కొడుకు మరణవార్త విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మేఘనాథ్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఏపీలోని బాపట్ల జిల్లా పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి.. హైదరాబాద్‌లోని పెదనాన్న ఇంటికి వెళ్లి… అక్కడి నుంచి బెంగళూరు వెళ్తుండగా ప్రమాదంలో చనిపోయింది.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు ప్రమాదంలో ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ఓ యువకుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పట్టణంలోని ప్రకాశం పంతులు రోడ్డుకు చెందిన మన్నేపల్లి రవి, కుసుమ దంపతుల కుమారుడు సత్యనారాయణ హైదరాబాద్‌లోని డీఆర్డీవో దుండిగల్‌లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఆఫీస్ పనిమీద గురువారం రాత్రి సత్యనారాయణ హైదరాబాద్ నుంచి బస్సులో బెంగళూరు బయల్దేరాడు. కర్నూలు వద్ద బస్సుకు ప్రమాదం జరగడంతో అప్పర్ బెర్త్‌లో ఉన్న సత్యానారాయణ ఆ ప్రమాదాన్ని గుర్తించాడు. వెంటనే తేరుకొని ముందుకు వెళ్తుండగా ఎగసిపడుతున్న మంటలతో ముందుకు వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. బస్సు వెనుక అద్దం పగులగొట్టిన ప్రయాణికులతోపాటు సత్యనారాయణ కూడా దూకి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా తన కుమారుడు వివరించినట్టు సత్యనారాయణ తండ్రి రవి తెలిపాడు.