నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 24 : కుమ్మెర బాధిత కుటుంబానికి బీసీ కమిషన్ అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ భరోసానిచ్చారు. జాతరలో జరిగిన దాడి ఘటనలో పసిగుడ్డు మృతి చెందడంపై తీవ్ర దిగ్భాంతి వ్యక్తంచేశారు. మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెరలో శిశువు అంత్యక్రియలు నిర్వహించిన చోటుకు కమిషన్ సభ్యులు, కలెక్టర్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్‌తో కలిసి వెళ్లిన ఆయన పూలమాలవేసి నివాళులర్పించారు.
మల్లికార్జునస్వామి ఆలయ పరిసరాలను సందర్శించి అక్కడివారిని వివరాలు అడిగి తెలుసుకొన్నారు. హోంగార్డు చిత్రీకరించిన వీడియోలను డీఎస్పీ శ్రీనివాసులు ఫోన్లో చూపించారు. పసిబిడ్డ తల్లిదండ్రులైన గణేశ్, మౌనిక ఇంటిని పరిశీలించారు. ఈ ఘటనను అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని విచారణ చేయాల్సిందిగా కలెక్టర్, ఎస్పీ, దేవాదాయశాఖను ఆదేశించారు. రాష్ట్ర బీసీ కమిషన్ నివేదిక అందిన వెంటనే చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.
నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన ఘర్షణలో చిన్నారి మరణానికి కారకులైన వారిలో ముగ్గురిని అరెస్టు చేసినట్టు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌జీ పాటిల్ తెలిపారు. చిలుకేశ్వరం చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 9 మందిపై కేసు నమోదు చేశామని, వీరిలో ఏ-1 శ్రీనివాస్‌రెడ్డి, ఏ-2 మధుసూదన్‌రెడ్డి, ఏ-3 శ్రీకాంత్‌రెడ్డిని అరెస్టు చేశామని తెలిపారు. ఏ-4 విష్ణువర్ధన్‌రెడ్డి, ఏ-5 కన్నిరెడ్డి, ఏ-6 కటిక నరేశ్, ఏ-7 తుకారాంరెడ్డి, ఏ-8 సతీశ్‌రెడ్డి, ఏ-9 మాధవరెడ్డి పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు.