ఖలీల్వాడి/కామారెడ్డి, ఫిబ్రవరి 24: ఇంటర్ వార్షిక పరీక్షలు నేటి (బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోని 58 పరీక్షా కేంద్రాల్లో 39 వేల మంది పరీక్షలకు హాజరు కానున్నారు. 19,299 మంది ఫస్టియర్, 17,664 మంది సెకండియర్, 2963 మంది ఒకేషనల్ విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. కామారెడ్డి జిల్లాలోని 37 పరీక్షా కేంద్రాల్లో 17,953 మంది హాజరు కానున్నారు. ఇందులో 9,013 మంది ఫస్టియర్ జనరల్, ఒకేషనల్ విద్యార్థులు కాగా, 8,940 మంది సెకండియర్ విద్యార్థులు ఉన్నారు.
ఫిబ్రవరి 25వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్ పరీక్షలకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగనున్న పరీక్షల కోసం ఉదయం 8.15 గంటలకే లోనికి అనుమతిస్తారు. గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులు వీలైనంత త్వరగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు విద్యాశాఖ, పోలీస్, రెవెన్యూ, విద్యుత్, ఆర్టీసీ, పోస్టల్, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయి. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. మరోవైపు, పరీక్షల పర్యవేక్షణకు చీఫ్ సూపరింటెండెంట్లు, అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. అలాగే, సిట్టింగ్, ఫ్లయింగ్ స్కాడ్స్ బృందాలు రంగంలోకి దిగనున్నాయి.
పరీక్షలు సమీపించడంతో కొన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు సొమ్ము చేసుకోవడంపై దృష్టి సారించాయి. ఫీజులు పూర్తిగా కడితేనే హాల్టికెట్లు ఇస్తామని వేధిస్తున్నాయి. హాల్టికెట్ ఇవ్వకపోతే ఏడాది వృథా అవుతుందన్న ఆందోళనతో తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లిస్తున్నారు. ప్రైవేట్ కళాశాలలు విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తుంటే అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రైవేట్ కళాశాలలతో అధికారులు కుమ్మక్కు కావడం వల్లే పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు మిగతా జిల్లాల కంటే వెనుకబడ్డాయి. గత రెండేళ్లుగా కామారెడ్డి అట్టడుగు స్థానానికి పడిపోయింది. 2023-24లో 44 శాతం ఉత్తీర్ణత, 2024-25లో 55 శాతంతో రాష్ట్రంలో చివరి స్థానానికి దిగజారడం అనేక విమర్శలకు తావిచ్చింది. ఇక నిజామాబాద్ పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలలో చదవడానికి విద్యార్థులు సుముఖత చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సారైనా మంచి ఫలితాలను సాధిస్తాయా.. లేదా? అన్నది వేచి చూడాలి.
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. నిర్దేశిత సమయంలో బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచిం చాం. పరీక్ష రాసే విద్యార్థులు ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా ఉండాలి.
– రవికుమార్, ఇంటర్ విద్యాధికారి, నిజామాబాద్
ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పా ట్లు పూర్తి చేశాం. ఎలాంటి మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నాం.
– షేక్ సలాం, ఇంటర్మీడియెట్ జిల్లా నోడల్ అధికారి