నంగునూరు, డిసెంబర్ 2 : సోదరుడి సహకారం ఉండదేమోనన్న అనుమానంతో సర్పంచ్‌గా నామినేషన్ వేసిన వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘనపూర్‌లో చోటుచేసుకున్నది. గ్రామస్థుల కథనం ప్రకారం.. ఘనపూర్ సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వు అయ్యింది. గ్రామానికి చెందిన ఘనపురం ఎల్లం సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశాడు. తన సొంత అన్న, మాజీ సర్పంచ్ బాల్‌నర్సయ్య, చిన్నాన్న కొడుకు సాయిలు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది.
ఒకే కుటుంబం నుంచి ఇద్దరు అన్నదమ్ములు పోటీలో ఉంటే మూడో వ్యక్తికి అనుకూలంగా మారుతుందంటూ గ్రామస్థులు చెప్పడంతో అన్న బాల్‌నర్సయ్య పోటీ నుంచి తప్పుకొన్నాడు. సోమవారం ఎల్లంతోపాటు సాయిలు నామినేషన్ దాఖలు చేశారు. సోదరుడి మద్దతు తనకు లభించదేమోనన్న అనుమానంతో ఎల్లం పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు ఎల్లంను సిద్దిపేట దవాఖానకు తరలించారు.