కంగ్టి, జనవరి 24: తన స్థలంలో పాఠశాల భవనాన్ని నిర్మించారంటూ ఓ వ్యక్తి స్కూల్‌కు తాళం వేశాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం రాంతీర్థ్ గ్రామ పంచాయతీ పరిధిలోని భోజ్యనాయక్ తండాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తండాకు చెందిన కిషన్‌నాయక్ అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం ప్రాథమిక పాఠశాలకు తాళం వేసి, విద్యార్థులకు బయటకు పంపించినట్టు సమాచారం. ఈ పాఠశాలలో మొత్తం తొమ్మిదిమంది విద్యార్థులు చదువుతున్నారు.
శనివారం కూడా పాఠశాలకు తాళం వేసి ఉండటంతో పిల్లల చదువు ఆపకుండా ఉపాధ్యాయుడు వారిని వరండాలో కూర్చోబెట్టి తరగతులు కొనసాగించారు. పాఠశాల భవనం నిర్మించిన స్థలం తనదంటూ కిషన్‌నాయక్ స్కూల్‌కు తాళం వేసినట్టు తెలిసింది. దీనిపై ఎంఈవో రహీమొద్దీన్ వివరణ కోరగా, పాఠశాల ప్రభుత్వ స్థలంలోనే నిర్మించారని, దౌర్జన్యంగా తాళం వేసిన వ్యక్తిపై కంగ్టి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.