హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): బీసీలకు అన్యాయం జరిగితే ఉద్యమం తప్పదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత వీ శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. కులగణన సర్వేలో కాలయాపన జరిగి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఫలాలు దక్కే విషయంలో అనుమానాలు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో శనివారం మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కులగణనను ఎక్స్‌రేతో పోల్చుతున్నారని, కానీ తాము ఎంఆర్ఐ అంటున్నామని స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అస్తవ్యస్త విధానాలతో కులగణన సర్వేలో గందరగోళం నెలకొన్నదని విమర్శించారు. డెడికేటెడ్ కమిషన్ వేయాలని హైకోర్టు ఆదేశించినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రణాళిక, బీసీ సంక్షేమ శాఖలు జారీచేసిన వేర్వేరు జీవోలతో అయోమయం నెలకొన్నదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బీసీ కమిషన్ చేపట్టిన సర్వేలో చిత్తశుద్ధి కనిపించడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం భేషజాలకు పోకుండా కులగణన సర్వేపై న్యాయకోవిదులు, మాజీ న్యాయమార్తులతో చర్చించాలని, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి సమగ్రంగా చర్చించి చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. బీసీ కమిషన్ జిల్లాల పర్యటనను కలెక్టర్లు పట్టించుకోకపోవడం బాధాకరమని, కమిషన్ సమావేశాలకు రాకుండా అవమానించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్-హైదరాబాద్ మార్గంలో ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని టీజీఎస్ఆర్టీసీ శనివారం వివరణ ఇచ్చింది. వాస్తవానికి ఆ రూట్లో గరుడ ప్లస్ బస్సు చార్జీ రూ.520గా ఉండేదని, దానిని రాజధాని చార్జీతో సమానంగా రూ.430కి తగ్గించినట్టు తెలిపింది. కొన్ని నెలలుగా ఈ రెండు సర్వీసులకు రూ.430 టికెట్ ధరే ఉన్నదని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తు తం రాష్ట్రవ్యాప్తంగా సాధారణ చార్జీలనే సంస్థ అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.