హైదరాబాద్, సెప్టెంబర్18 (నమస్తే తెలంగాణ ): ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులను కీలక పదవుల్లో కొనసాగించవద్దని… ఫీజు రీయింబర్స్మెంట్, అద్దెల చెల్లింపులకు నిధులు లేవని.. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నామని చెప్పుకొస్తున్నది. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోతలు పెడుతున్నది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి. ఇందుకు మైనారిటీ గురుకుల సొసైటీ నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది. అర్హతలు లేకున్నా.. నిబంధనలు వర్తించకున్నా.. దరఖాస్తు తీసుకోకుండా ఉన్నతాధికారులకు నచ్చినవాళ్లను నచ్చిన పోస్టులో భారీ వేతనంతో కూర్చోబెడుతున్నారు. లేని ఉద్యోగులను ఉన్నట్టుగా చూపుతూ జీతాల చెల్లింపు పేరుతో కోట్లలో గోల్మాల్ చేస్తున్నారు. సొసైటీపై ఆర్థిక భారాన్ని మోపుతున్నారు. అక్రమాలపై ఉద్యోగులు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు.
తెలంగాణ మైనారిటీ గురుకుల సొసైటీలో 204 గురుకులాలు ఉన్నాయి. వాటిలో 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు బోధన కొనసాగుతున్నది. సొసైటీలో రెగ్యులర్ సిబ్బంది కాకుండా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో 3756 మందిని నియమించుకునేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. గత ఏప్రిల్ నుంచి 2026 మార్చి 21 వరకు సేవలను పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మంజూరు చేసిన పోస్టులను నింపకుండానే వేతనాల పేరిట పలువురు ఉన్నతాధికారులు కోట్లలో నిధులు పక్కదారి పట్టిస్తున్నారని సొసైటీవర్గాల ద్వారా తెలిసింది. టీజీటీ, జేఎల్, ఫిజికల్ డైరెక్టర్, డాటా ఎంట్రీ ఆపరేటర్‌తోపాటు ల్యాబ్ అటెండర్ల పోస్టులలోనూ అక్రమాలు జోరుగా జరుగుతున్నాయని సమాచారం. మంజూరైన పోస్టులు, భర్తీ చేసిన పోస్టుల మధ్య భారీగా వ్యత్యాసం ఉంటున్నది. భర్తీ చేయని ఉద్యోగాలకు కూడా పెద్దఎత్తున జీతాలను చెల్లిస్తున్నట్టు చూపుతూ కొందరు అక్రమాలకు పాల్పుతున్నారు. మైనారిటీ గురుకులాల్లో ఎక్కడ కూడా ఒక్క ఐసీటీ ఇన్స్ట్రక్టర్, ల్యాబ్ అంటెండర్ లేరు. కుక్‌లు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల లెక్కలూ తప్పుల తడకగానే ఉన్నాయి.
రాష్ట్రంలో ఏ గురుకుల సొసైటీలో లేనివిధంగా మైనారిటీ గురుకులంలో వేర్వేరు పేర్లతో కొత్త పోస్టులను సృష్టించారు. అన్ని సొసైటీల్లో సెక్రటరీతోపాటు, డిప్యూటీ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు ఉన్నారు. అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ తదితర బాధ్యతలను వారే నిర్వర్తిస్తున్నారు. కానీ మైనారిటీ సొసైటీ పాలన భిన్నంగా నడుస్తున్నది. మైనారిటీ గురుకుల సొసైటీలో సెక్రటరీ తప్ప, ఇతర పోస్టుల్లో ఇప్పటివరకు ఎవరూ లేరు. దీంతో ప్రైవేట్ వ్యక్తులకు, విశ్రాంత ఉద్యోగులకు కీలక బాధ్యతలు అప్పగించారు. మంజూరైన పోస్టుల పేరిట వేతనాలను డ్రా చేస్తూ, ఆ మొత్తాన్ని ఇతర పోస్టుల్లో నియమించిన ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి మళ్లిస్తున్నారని తెలిసింది. ఆర్థికశాఖ అనుమతులు లేకుండా, నోటిఫికేషన్ ఇవ్వకుండా మైనారిటీ సొసైటీ విశ్రాంత ఉద్యోగులను వివిధ పోస్టుల్లో నియమించుకుంటున్నది. కీలక స్థానాల్లోనూ అడ్డదారిలో నియామకమైన వారు… ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ, సిబ్బందిపై పెత్తనం చెలాయిస్తూ సొసైటీని భ్రష్టు పట్టిస్తున్నారని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గత మార్చిలో వారి సర్వీసును రద్దుచేసినా ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే మళ్లీ సదరు అధికారులను నియమించడం గమనార్హం. సొసైటీ అకడమిక్ ఇన్చార్జిగా ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి ఒకరికి నెలకు రూ.1.50 లక్షల వేతనం చెల్లిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ప్రధాన పోస్టుల్లో పాగా వేసిన ప్రైవేటు వ్యక్తులు సొసైటీ ప్రిన్సిపాల్స్, ఉద్యోగ, ఉపాధ్యాయులతో సంబంధం లేకుండా, సంప్రదించకుండా ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కోర్సులను ప్రవేశపెట్టడం, ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకం, డైట్ తదితర టెండర్లను ఫైనల్ చేయడం వంటి కీలక అంశాల్లో చక్రం తిప్పుతున్నారని తెలిసింది. వివిధ టెండర్లు, స్టేషనరీ కొనుగోళ్లలో కమీషన్లు వసూలు చేస్తున్నారని సొసైటీ ఉద్యోగులు చెప్తున్నారు. సొసైటీ ప్రధాన కార్యాలయంలో పాగా వేసిన ప్రైవేట్ వ్యక్తులే మొత్తం చెలాయిస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు.
ప్రభుత్వంలో శాఖల పరంగా విజిలెన్స్ విభాగాలు ఉంటాయి. కానీ మైనారిటీ సొసైటీ మాత్రం ప్రత్యేకంగా విజిలెన్స్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగం మొత్తాన్ని ప్పైవేట్ వ్యక్తులతోనే ఏర్పాటు చేయడం గమనార్హం. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 25-30మందిని నియమించింది. ఒకొకరికి రూ.40వేల జీతంతోపాటు వాహన సౌకర్యం కల్పించింది. నెలకు దాదాపు రూ.15 లక్షల వరకు విజిలెన్స్ విభాగం కోసమే వెచ్చిస్తున్నది. విజిలెన్స్ విభాగంలోని ప్రైవేట్ వ్యక్తులు.. ప్రిన్సిపాల్స్నుబెదిరిస్తూ అవినీతికి పాల్పడుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఓ మైనారిటీ సొసైటీ విజిలెన్స్ అధికారిపై భారీగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. అక్రమాలపై ప్రశ్నించిన వారికి మెమోలు ఇవ్వడం, సస్పెండ్ చేయడం సొసైటీలో పరిపాటిగా మారిందని తెలిసింది. సొసైటీలోని అక్రమార్కులు ప్రభుత్వ ఖజానాకు గండిపెడుతున్నారని పేర్కొంటూ సిద్దిపేటకు చెందిన ఒకరు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. కానీ ప్రభుత్వం నుంచి చర్యలు శూన్యం.
మైనారిటీ గురుకుల సొసైటీలో అక్రమాలపై ప్రభుత్వం ఎట్టకేలకు దిగొచ్చింది. సొసైటీలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు చెల్లిస్తున్న నెలవారీ వేతనాల్లో విధించిన కోతలను సవరించింది. గతంలో మాదిరిగానే వేతనాలను చెల్లిస్తూ గత ఉత్తర్వులను సవరించింది. ఈ మేరకు ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సొసైటీలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీస్‌ను గత ఏప్రిల్ నుంచి 2026 మార్చి 21 వరకు పునరుద్ధరిస్తూ ప్రభుత్వం తాజాగా 16వ తేదీన జీవో 1437 పేరిట ఉత్తర్వులు జారీచేసింది. అయితే సదరు ఉద్యోగుల వేతనాల్లో భారీగా కోతలు పెట్టింది. జేఎల్ వేతనాన్ని రూ.35 వేల నుంచి రూ.23,400గా, పీజీటీల వేతనం రూ.31,395 ఉండగా ప్రస్తుతం రూ.18,200లకు, టీజీటీల వేతనం రూ.28,660 ఉండగా, ప్రస్తుతం రూ.18,200లకు తగ్గించింది. అదేవిధంగా ఔట్సోర్సింగ్ విభాగంలో సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, కుక్‌లు, కంప్యూటర్ టీచర్లు, పీడీలు, పీఈటీలు తదితర సిబ్బంది వేతనాలను కూడా భారీగా తగ్గించింది. ఒక్కో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగికి సగటును రూ.5వేల నుంచి రూ.13వేల వరకు కోత విధించింది. ఉన్నతాధికారుల వద్ద, కార్యాలయంలో పనిచేసే డ్రైవర్ల వేతనం రూ.19,500 కంటే తక్కువగా టీజీటీ, పీజీటీల వేతనాన్ని రూ.18,200లుగా నిర్ధారించింది. ప్రభుత్వం నిర్ణయంపై ఔట్సోర్సింగ్ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ‘డైవర్ వేతనం కన్నా టీచర్ జీతం తక్కువ’ శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చింది. గతంలో మాదిరిగానే వేతనాలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, సెప్టెంబర్18 (నమస్తే తెలంగాణ): వేతనాల్లో కోత విధించడంపై మైనార్టీ గురుకుల సొసైటీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్‌టైం ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్కారు నిర్ణయంపై తీవ్రంగా మండిపడుతూ.. గురువారం నాంపల్లిలోని సొసైటీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. గతంలో మాదిరిగానే వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. మైనార్టీ గురుకుల సొసైటీలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్‌టైం ఉద్యోగులకు చెల్లిస్తున్న నెలవారీ వేతనాలను సవరిస్తూ ఇటీవల రాష్ట్ర ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అన్నిజిల్లాల నుంచి భారీగా తరలివచ్చి ధర్నాకు దిగారు. కాంగ్రెస్ సర్కారు వైఖరిపై మండిపడ్డారు. సొసైటీ కార్యదర్శి షఫియుల్లాను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.