Runa Mafi | అచ్చంపేట రూరల్, నవంబర్ 11 : రుణమాఫీ చేసే వరకు అప్పు కట్టనని ఓ రైతు తెగేసిచెప్పాడు. అతనితోపాటు మరికొందరు కూడా తమ సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించడంతో చేసేదేమీ లేక బ్యాంకు అధికారులు వెనుదిరిగారు. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో సోమవారం చోటుచేసుకున్నది. వడ్డీ కట్టి పంట రుణాలను రెన్యువల్ చేసుకోవాలని, మహిళా సంఘాల సభ్యులు అప్పులు సక్రమంగా చెల్లించాలంటూ సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం సింగారం గ్రామంలో ఏపీజీవీబీ నాగర్‌కర్నూల్ రీజినల్ అధికారులు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా రైతు జైపాల్‌నాయక్ మాట్లాడుతూ.. తనకు రూ.2 లక్షలకుపైగా పంట రుణం ఉన్నదని, ప్రభుత్వం రుణమాఫీ చేసేవరకు బ్యాంకు అప్పు కట్టనని తేల్చి చెప్పారు. మరికొందరు రైతులు మాట్లాడుతూ.. బ్యాంకులో దళారులే రాజ్యమేలుతున్నారని ఆరోపించారు. పంట రుణాలు ఇవ్వడం, రెన్యువల్ చేయడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. రూ.2 లక్షలు దాటిన రైతులకు రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలని పట్టుబట్టారు. ఆగస్టులో మాఫీ చేశామని ప్రభుత్వం ప్రకటించినా.. ఇప్పటివరకు డబ్బులు జమ కాలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సిబిల్ స్కోర్ లేదంటూ రుణం కోసం నెలల తరబడి బ్యాంకుల చుట్టూ తిప్పుకొంటున్నారని, దళారుల వద్దకు వెళ్తే పర్సంటేజ్ తీసుకొని పనులను క్షణాల్లో చేయిస్తున్నారని మండిపడ్డారు.
డెయిరీఫాం ఏర్పాటుకు లోన్ ఇవ్వలేదని, అలిసిపోయి వదిలేసుకున్నామని గ్రామ యాదవ సంఘం నాయకులు సురేశ్‌యాదవ్, శ్యాంసుందర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకులో ఏండ్ల తరబడి లావాదేవీలు చేసినా.. వ్యక్తిగత, వ్యాపార రుణం ఇవ్వడంలో ఏపీజీవీబీ విఫలం కావడంతో వేరే బ్యాంకులను ఆశ్రయించాల్సి వచ్చిందని వ్యాపారుడు బక్కయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల వారీగా దళారులను ఎంపిక చేసుకొని క్రాప్లోన్లు, రెన్యువల్ చేయించి ఫీల్డ్ ఆఫీసర్లు కమీషన్లు దండుకుంటున్నారని ఆరోపించారు. దీంతో చేసేదేమీలేక బ్యాంకు అధికారులు నెమ్మదిగా జారుకున్నారు. ఈ సమావేశంలో ఏపీజీవీబీ చీఫ్ మేనేజర్ రమేశ్‌యాదవ్, ఫీల్డ్ ఆఫీసర్ సురేశ్ పాల్గొన్నారు.