జగదేవపూర్, జూన్ 18 : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం కొండాపూర్‌లో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. కొండాపూర్‌కు చెందిన తీగుల్ల రాజు (35) దౌలాపూర్‌లో మూడెకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మక్క సాగుచేసేవాడు. పెట్టుబడి కోసం రూ.2 లక్షలు అప్పు చేశాడు.
పంట సరిగ్గా పండక, అప్పులు తీర్చే మార్గం లేక మనోవేదనకు గురయ్యాడు. అప్పులు తీర్చే మార్గంలేక సతమతమవుతున్న అతనికి అనారోగ్య సమస్య మరింత కలిచివేసింది. తీవ్ర మనస్తాపం చెందిన ఆయన తాను నివసిస్తున్న పూరి గుడిసెలోనే మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
కూలీ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన భార్య.. రాజు పరిస్థితిని గమనించి స్థానికుల సాయంతో గజ్వేల్ సర్కారు దవాఖానకు తరలించింది. మెరుగైన వైద్యం కోసం గాంధీకి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.