హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని 5వ షెడ్యూల్డ్లో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాలను గిరిజన నిరుద్యోగులతోనే చేపట్టాలని, ఇప్పటికే పనిచేస్తున్న టీచర్లకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ టీచ ర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు వందలాది మంది టీచర్లు, ఆదివాసీ యువకులతో హైదరాబాద్లోని మాసబ్ ట్యాంక్లోగల సంక్షేమ భవన్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా టీఎస్ ఏటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మోకాళ్ల శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాకుల రవి మాట్లాడుతూ.. ఏజన్సీ ప్రాంతాల్లోని అన్ని యాజమాన్య పాఠశాలల్లోని ఉపాధ్యాయ ఖాళీలను ప్రత్యేక ఏజెన్సీ డీఎస్సీ 2024 నిర్వహించి ఆదివాసీ గిరిజన నిరుద్యోగులతో మాత్రమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో పీటీజీ చెంచు తెగలకు కేటాయించిన 56 ఎస్జీటీ ఉపాధ్యాయ పోస్టుల్లో ప్రస్తుతం పనిచేస్తున్న సీఆర్టీలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఏటూరునాగారం, మార్చి 11: ఏజెన్సీ స్పె షల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయం ఎదుట తుడుందెబ్బ, ఏటీఎఫ్, ఆదివాసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు.