హైదరాబాద్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): మతసామరస్యానికి, పరమత ప్రేమకు, లౌకికత్వానికి ప్రతీకగా ఉన్న బీఆర్ఎస్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు జమాతే-ఇ-అహ్లే సన్నత్ రాష్ట్రశాఖ ప్రకటించింది. మంగళవారం సంస్థ ప్రతినిధులు, ఇస్లామిక్ పండితులు, ఇమామ్‌లు, వివిధ దర్గాల ఖాన్ఖాలతో కూడిన జమాత్ మంత్రి హరీశ్‌ను కలిసి మద్దతు ప్రతిని అందించింది. ముస్లింల సంక్షేమం కోసం కృషి చేస్తున్నందుకే బీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడుతూ తెలంగాణలో మైనారిటీల సంక్షేమానికి కేటాయించిన బడ్జెట్ దేశంలోని మరే రాష్ట్రంలో లేదని తెలిపారు. షాదీముబారక్ పథకం ద్వారా మైనారిటీ ఆడబిడ్డల వివాహాలకు ప్రభుత్వం అధికమొత్తంలో ఖర్చు చేస్తున్నదని వివరించారు. గంగా జమున తెహ్‌జీబ్‌కు అచ్చమైన నిర్వచనం తెలంగాణ అని తెలిపారు. గత పదేండ్లలో రాష్ట్రంలో మతం పేరుతో అల్లర్లు జరగలేదని, శాంతిసామరస్యాలతో తెలంగాణ ఫరిడవిల్లుతున్నదని మంత్రి పేర్కొన్నారు.