Samagra Kutumba Survey | హైదరాబాద్, నవంబర్14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే క్షేత్రస్థాయిలో తప్పుల తడకగా కొనసాగుతున్నదని సామాజికవేత్తలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఎన్యూమరేటర్లు అరకొరగా సమాచారాన్ని సేకరిస్తున్నారని మండిపడుతున్నారు. శాస్త్రీయత లేకుండా, పకడ్బందీగా నిర్వహించకపోవడంతో కచ్చితమైన లెక్కలు వచ్చే అవకాశం ఉండబోదని హెచ్చరిస్తున్నారు. వెరసి సర్వే చేసినా పూర్తిగా నిష్ప్రయోజనంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్వే పారదర్శకంగా, పకడ్బందీగా కొనసాగేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.
సర్వేలో ఇండ్ల స్టిక్కరింగ్ మొదలు, ప్రస్తుతం కొనసాగుతున్న సర్వే తీరు పూర్తిగా తప్పుల తడకగా కొనసాగుతున్నదని సామాజిక వేత్తలు, కులసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సర్వే చేయాల్సిన ఇండ్లను గుర్తించి, స్టిక్కర్లు వేశారు. అయితే ఈ క్రమంలోనే అనేక మంది గృహ యజమానులు విముఖత చూపారు. స్టిక్కరింగ్ చేసేందుకు అంగీకరించలేదు. దీంతో ఎన్యూమరేటర్లు సైతం చేసేదేమీ లేకుండా ఆ ఇండ్లను మినహాయించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఇండ్లను ఇదే రీతిలో మినహాయించారని సామాజికవేత్తలు వెల్లడిస్తున్నారు. ఇదిలా ఉంటే స్టిక్కరింగ్ చేసిన ఇండ్లకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా సేకరిస్తున్నారా? అంటే అదీ లేదని కులసంఘాలు ఆరోపిస్తున్నాయి. తొలుత స్టిక్కరింగ్ చేయించుకున్న గృహ యజమానులు సైతం ప్రస్తుతం సర్వేలో తమ వివరాలను వెల్లడించేందుకు విముఖత చూపుతున్నట్టు ఎన్యూమరేటర్లే చెబుతున్నారు. చేసేదేమీలేక ఆ ఇండ్లను సర్వే చేయకుండానే వదిలేస్తూ ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. ఇక పట్టణాల్లోనైతే పరిస్థితి మరీ దారుణంగా ఉన్నదని, స్లమ్ ఏరియాలు మినహా మిగతా ప్రాంతాల్లో సర్వే చేయడం సవాలుగా మారిందని ఎన్యూమరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటింటి సర్వేలో కచ్చితమైన లెక్కలు తీయాలంటే ఇప్పటికే అందుబాటులో ఉన్న గణాంకాలతో క్షేత్రస్థాయిలో తులనాత్మక అధ్యాయనం చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో కొత్త కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేస్తే సరిపోయేదని బీసీ మేధావి వర్గం చెబుతున్నది. కానీ, ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్నదని వెల్లడించింది. గృహ యజమానులు చెప్పిన సమాచారాన్నే ఎన్యూమరేటర్లు నమోదు చేస్తున్నారని, అది వాస్తవమా? కాదా? అని పరిశీలనకు ఎక్కడా ఆస్కారం లేకుండా పోయిందని వివరిస్తున్నారు. చాలా మంది గృహ యజమానులు ఆస్తులు, ఆదాయ వివరాలను వెల్లడించేందుకు విముఖత చూపుతున్నారని, కుటుంబీకుల వివరాలు, కులం మినహా ఇతర వాటిని చెప్పేందుకు ముందుకురావటం లేదని ఎన్యూమరేటర్లు సైతం తెలుపుతున్నారు. దీంతో అరకొరగానే సమాచార సేకరణ కొనసాగుతున్నట్టు అర్థమవుతున్నది. అదీగాక గృహ యజమానులు ఇచ్చే సమాచారం మీదనే ఆధారపడితే సర్వే ప్రామాణికతనే దెబ్బతింటుందని, ఆయా అంశాలకు సంబంధించిన కచ్చితమైన లెక్కలు వచ్చే అవకాశమే లేకుండా పోతుందని సామాజికవేత్తలు తేల్చిచెబుతున్నారు.
సర్వేలో కొన్ని ఇండ్లను గణించి, మరికొన్నింటిని వదిలేస్తుండటంతో సమగ్ర సమాచార సేకరణ ఎలా అవుతుందని సామాజికవేత్తలు, కులసంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది వివరాలను సేకరించి, మరికొందరిని వదిలేయటంతో సమగ్రత లేకుండా పోతుందని వివరిస్తున్నారు. అరకొరగా సేకరించిన సమాచారాన్ని క్రోడికరించి రూపొందించే గణాంకాలు కూడా క్షేత్రస్థాయి పరిస్థితులను ప్రతిబింబించబోవని వెల్లడిస్తున్నారు. సేకరించిన డేటా కచ్చితత్వం, ప్రామాణికతపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. వెరసి మొత్తంగా సర్వే ఉద్దేశం నెరవేరడమే ప్రశ్నార్థకంగా మారుతుందని వివరిస్తున్నారు.