Revanth Reddy | మహబూబ్‌నగర్ : మహబూబ్ నగర్ జిల్లా పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు అయ్యాయి. రేవంత్ వ్యాఖ్యలను ఆయా జిల్లాల పోలీసు అధికారుల అసోసియేషన్లు తీవ్రంగా ఖండించాయి. ఆగష్టు 14న మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంతమంది నాయకులు గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మీటింగ్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పోలీసులను ఉద్దేశించి ఒక్కొక్కడిని గుడ్డలూడదీసి కొడతానని అనుచిత వ్యాఖ్యలు చేశారు. కొంత మంది పోలీసుల పేర్లను డైరీలో రాసి పెట్టుకుంటున్నానని వ్యాఖ్యానించారు.
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. మేం చట్టానికి, న్యాయ స్థానాలకు లోబడి పనిచేస్తాం తప్ప.. ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని, భవిష్యత్లోనైన పోలీస్ వ్యవస్థను విమర్శించే ప్రక్రియను మానుకోవాలని పోలీసు అసోసియేషన్లు సూచించాయి. రేవంత్‌పై భూత్పూర్ పోలీస్ స్టేషన్లో Cr.No 184/2023, u/s 153, 504, 505 (2), 506 IPC సెక్షన్లు, జడ్చర్ల పోలీస్ స్టేషన్లో Cr.No 499/2023, u/s 153, 504, 505 (2), 506 IPC సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.