హైదరాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ) : అర్చకులకు గౌరవప్రదమైన జీవనాన్ని అందించే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం అందజేసిన వేతనాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. రాష్ట్రంలోని దాదాపు 13వేల పైచిలుకు ఆలయాల్లో అర్చకులు, అర్చక ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా 3,500, ధూప దీప నైవేద్య(డీడీఎన్) పథకం ద్వారా 9,771 ఆలయాల్లో వేతనాలు ఇవ్వాల్సి ఉన్నది. కేసీఆర్ హయాంలో క్రమం తప్పకుండా వేతనాలు అందుకున్న అర్చకులకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. దేవాదాయ శాఖ, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్లో పనిచేస్తున్న సుమారు 100మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం రెండు నెలలుగా వేతనాలు అందలేదు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తే.. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే ఇస్తామని చెబుతున్నారు. రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకుంటే ఎలా బతకాలని, ఆలయాల్లో ధూప దీప నైవేద్య కార్యక్రమాలు నిలిపివేయాల్సిన పరిస్థితి వస్తున్నదని అర్చకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
రుణమాఫీ అందడం లేదంటూ బుధవారం మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్ సహకార సంఘం కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. మండలంలోని అన్ని బ్యాంకులకు రుణమాఫీ వస్తే, తమకెందుకు రావడం లేదని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సుమారు గంటపాటు కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. – రామాయంపేట
మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంటలో కురుస్తున్న వర్షాలతో బోరుబావులు పూడుకుపోయి.. మోటర్లు కొట్టుకుపోయాయి. పంచాయతీ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్లు వచ్చినప్పుడు మహిళలు బిందెలతో యుద్ధం చేయాల్సి వస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం పెద్దతండావాసులు కూడా తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. పది రోజులుగా బుడగజంగం కాల నీకి నీళ్లు రావడంలేదని వాపోయారు.