ములుగు : ఇంటి డాబా(Building) పైనుంచి నిచ్చెన(Ladder) ద్వారా దిగుతుండగా అది విరగడంతో కిందపడి బాలుడు మృతి(Died) చెందాడు. ఈ విషాదకర సంఘటన ములుగు(Mulugu) జిల్లా వాజేడు మండలంలోని కడెకల్ గ్రామంలో చోటుచేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యర్మ హరినాథ్, కృష్ణవేణి దంపతుల కుమారుడు యర్మ తేజ(9) స్థానిక పాఠశాలలో 4 వ తరగతి చదువుతున్నాడు.
ఉదయం ఇంటి వద్ద నిచ్చెన ద్వారా డాబా దిగుతూ అది విరగడంతో జారి కింద పడ్డాడు. తల్లిదండ్రులు వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అక్కడ ఉన్నవారిని కలిచి వేసింది. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.