హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొద్దిరోజుల క్రితం కలకలం సృష్టించిన పెద్దపులి తాజాగా ములుగు జిల్లాలో ప్రత్యక్షమైంది. వెంకటాపురం మండలంలోని భోదపురం, ఆలుబాక, తిప్పాపురం, సీతారాంపురం, రామచంద్రపురం గ్రామాల పరిసరాల్లో పులి గాండ్రింపులు విన్నట్టు స్థానికులు చెప్పడంతో అటవీ అధికారులు రంగంలోకి దిగారు. పాదముద్రల ఆధారంగా దాని కదలికలను గుర్తించారు.
మంగపేట, తాడ్వాయి అడవుల్లో సంచరించిన ఈ పులి చుంచుపల్లి మీదుగా మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి గుట్టవైపు వెళ్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక అడవుల్లో ప్రవేశించినట్టు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ట్రాప్ కెమెరాలను అమర్చడంతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఒంటరిగా అడవుల్లోకి వెళ్లవద్దని ప్రజలకు, పశువుల కాపరులకు సూచించారు. ఎవరికైనా పులి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.