హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద భారీగా గంజాయి (Ganja) పట్టుబడింది. పండ్ల ట్రేలలో పెట్టి డీసీఎంలో తరలిస్తుండగా ఖమ్మం ఈగల్ పోలీసులు, రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 935 కిలోల గంజాయిని సీజ్ చేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా బాటసింగారం పండ్ల మార్కెట్ సమీపంలో పట్టుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 35 సంచుల్లో 455 గంజాయి ప్యాకెట్లను పండ్ల ట్రేలలో పెట్టి డీసీఎంలో తరలిస్తున్నారని, దీని విలువ రూ.5 కోట్లు ఉంటుందని చెప్పారు.
మహారాష్ట్రకు చెందిన పవార్ కుమార్ అనే కీలక నిందితుడిని అరెస్టు చేశామని, విక్కీ సేత్ అనే వ్యక్తి ద్వారా గంజాయిని ఒడిశా నుంచి తరలిస్తున్నారని వెల్లడించారు. డీసీఎంకు ఎస్కార్ట్గా ఇన్నోవా కారు వెళ్తున్నట్టు గుర్తించామన్నారు. కారు, డీసీఎంను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని చెప్పారు.