శ్రీశైలం/గద్వాల/అయిజ/మహదేవపూర్, జూలై 1 : శ్రీశైలం డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి నుంచి 30,722 క్యూసెక్కులు, క్రస్ట్ గేట్ల నుంచి 60,075 క్కూసెక్కులు విడుదలై మంగళవారం సాయంత్రానికి 90,797 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయానికి చేరినట్టు అధికారులు తెలిపారు. డ్యామ్ పూర్తిస్థాయి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 162.4372 టీఎంసీల నీరు నిల్వ ఉండగా.. అవుట్‌ఫ్లో 58,750 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 87వేల క్యూసెక్కులు నమోదు కాగా 9 గేట్లు దిగువకు విడుదల చేశారు. మొత్తం అవుట్‌ఫ్లో 92,985 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.590 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. తుంగభద్ర డ్యామ్‌కు ఇన్‌ఫ్లో 28,902, అవుట్‌ఫ్లో 2,386 క్యూసెక్కులు ఉన్నది. డ్యామ్ సామర్థ్యం 105.788 టీఎంసీలకు 74.486 టీఎంసీలు నిల్వ ఉన్నది.
మేడిగడ్డ బరాజ్‌కు పెరుగుతున్న వరద
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్ వరద ప్రవాహం పెరుగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా మహారాష్ట్రలోని ప్రాణహిత, తెలంగాణలోని గోదావరి నదుల ప్రవాహం వారం రోజులుగా క్రమంగా పెరుగుతూ వస్తున్నది. సోమవారం బరాజ్ ఇన్‌ఫ్లో 8,400 క్యూసెకులు కాగా మంగళవారం 12,500 క్యూసెకులకు పెరిగింది. దీంతో బరాజ్‌లోని మొత్తం ఎనిమిది బ్లాక్‌లలో ఉన్న 85 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు.