నమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 25 : వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో తొమ్మిది మంది దుర్మరణం చెందారు. ఆదిలాబాద్ జిల్లా లో జరిగిన ఒకే ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన రెండు ప్రమాదాల్లో ముగ్గురు, మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు మరణించారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన సృజిత్ బైక్‌పై మహారాష్ట్రలోని కిన్వట్ కు తన సోదరుడి నిశ్చితార్థానికి వెళ్లారు. సాయం త్రం తిరుగుపయనం కాగా.. తాంసి మండలం హస్నాపూర్ వద్ద ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సృజిత్ (40), మనీశా (15)తోపాటు మరో బైక్‌పై ఉన్న నారాయణ (30) అక్కడికక్కడే మృతి చెందగా, వందన, సంస్కార్లకు తీవ్రగాయాలయ్యాయి.
వీరిని రిమ్స్ కు తరలించగా.. చికిత్స పొందుతూ సంస్కార్ (11) మృతిచెందాడు. కాగా, మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం సోమారం గ్రామశివారులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. రాయపర్తికి చెందిన సాగర్ (23), వరంగల్ కరీమాబాద్ ఉర్సుగుట్టకు చెందిన శివ (25) అన్నా రం దర్గా నుంచి బైక్‌పై తొర్రూరు వస్తున్నారు. సోమారం నుంచి అన్నారం వైపు వెళ్తున్న ట్రాక్టర్ తగలడంతో కిందపడిపోయారు. దీంతో సాగర్‌ను తొర్రూరుకు, శివను ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హైతాబాద్ వెల్స్పన్ కంపెనీ వద్ద శనివారం రాత్రి ముగ్గురు వ్యక్తులు స్కూటీపై నాగరకుంట వైపు వెళ్తుండగా.. డీసీఎం వాహనాన్ని ఓవర్‌టెక్ చేయబోయి రాంగ్రూట్లో వెళ్లి ఎదురుగా వస్తున్న బోలేరా వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న హిమాన్షు చతుర్వేది (27), ఇలాంజన్ చెల్లన్ (33) అక్కడిక్కడే మృతిచెందారు.
పెండ్లి అయిన మూడు రోజులకే..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవ వధువు దుర్మరణం చెందింది. మొయినాబాద్ లో ఉంటున్న వినోద్‌కుమార్ కూతురు పైమిన టక్వాని (26)కి తాహేర్ అనే యువకుడితో 3 రోజుల కింద పెండ్లయింది. టక్వాని శనివారం తన భర్త తాహేర్, మరిది సోహెల్, చెల్లెలు మయెక్తో అమ్డాపూర్‌కు వెళ్లే రోడ్డులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన విందుకు హాజరయ్యారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు కారులో తిరిగి మొయినాబాద్‌కు వస్తుండగా జేబీఐఈటీ సమీపంలో విద్యుత్తు స్తంభాన్ని వీరి కారు ఢీకొన్నది. అందులో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దవాఖానకు తరలించగా, పైమిన టక్వాని మృతి చెందింది.