Land Acquisition | హైదరాబాద్, రంగారెడ్డి, మార్చి 16 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కారు పచ్చటి పంట పొలాల్లో మరోసారి పారిశ్రామిక చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శలు ఎదుర్కొంటున్నది. రంగారెడ్డి జిల్లా మొండిగౌరెల్లి గ్రామంలో పారిశ్రామికవాడ కోసమంటూ భూమి సేకరించేందుకు సర్కారు ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో రైతుల గుండెల్లో పిడుగు పడ్డంత పనయింది. మొత్తం 638 మంది రైతుల నుంచి 821.11 ఎకరాలు సేకరించనున్నట్టు పేర్కొంది. ఇందులో 498మంది రైతులకు చెందిన 113ఎకరాల అసైన్డ్ భూములు కాగా పెద్దఎత్తున భూదాన్ భూములు కూడా ఉన్నాయి. నోటిఫికేషన్లో పేర్కొన్న భూములన్నీ పచ్చని పంటలు పండే మాగాణి భూములే కావడంతో రైతులు దిగ్భ్రాంతి చెందుతున్నారు. మరోవైపు ఇబ్రహీంపట్నం డివిజన్ కార్యాలయంలో భూమి ప్లాన్‌ను తనిఖీ చేసుకోవచ్చని ప్రభుత్వం నోటిఫికేషన్లో స్పష్టంచేసింది. భూమిని అభివృద్ధి చేసేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు వెల్లడించింది. కలెక్టర్ నుంచి ముందస్తు అనుమతి లేకుండా సదరు భూముల క్రయవిక్రయాలు, లీజు, ఇతర లావాదేవీలు చేపట్టవద్దని తేల్చిచెప్పింది. అభ్యంతరం ఉన్నవారు 60 రోజుల్లోగా జిల్లా కలెక్టర్, అధీకృత అధికారికి తెలపవచ్చని సూచించింది.
ఫ్యూచర్ సిటీ పేరు మీద!
కాంగ్రెస్ సర్కారు ఫ్యూచర్‌సిటీ పేరుతో రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం తిమ్మాయిపల్లిలో 366 ఎకరాలు, మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో 275 ఎకరాలు భూములను సేకరించేందుకు ఇప్పటికే కలెక్టర్ నోటిఫికేషన్లు జారీచేశారు. తాజాగా యాచారం మండలం మొండిగౌరెల్లిలో 821 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఇటీవల మొండిగౌరెల్లి ప్రజలు తమ గ్రామాన్ని ఫ్యూచర్‌సిటీలో కలపాలంటూ డిమాండ్ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. కానీ ప్రభుత్వం మాత్రం తమ పొట్టకొట్టే నిర్ణయం తీసుకుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
నోటిఫికేషన్లో పేర్కొన్న భూమికి చుట్టుపక్కల మరికొంత భూమిని కూడా సేకరించేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రతిపాదిత ఫ్యూచర్‌సిటీలో మొండిగౌరెల్లి గ్రామం లేకపోయినా అక్కడి భూమిని సేకరించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. అలాగే మంచాల మండలంలోని దాత్పల్లిని కలపడం ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు.
మొండిగౌరెల్లి, దాత్పల్లిలో అలజడి
ఫ్యూచర్‌సిటీలో తమ గ్రామాలు లేకున్నా భూమిని సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం ఏంటని ఆ రెండు గ్రామాలైన మొండిగౌరెల్లి, దాత్పల్లి గ్రామాల్లో అలజడి మొదలైంది. ప్రతిపాదిత ఫ్యూచర్‌సిటీలో తమ గ్రామాలు లేకున్నా తమ భూములను ఎందుకు తీసుకుంటారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఫ్యూచర్‌సిటీ డెవలప్మెంట్ అథారిటీ పేరుతో దాని పరిధిలో ఉన్న గ్రామాల్లో ప్రభుత్వం భూములను తీసుకుంటున్నది. తమ గ్రామాన్ని ఫ్యూచర్‌సిటీలో కలపాలని మంత్రులు, ఎమ్మెల్యే, కలెక్టర్ విజ్ఞప్తి చేసినా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పొలాల్లో పరిశ్రమలెందుకు?
ఫ్యూచర్‌సిటీని 30 వేల ఎకరాల్లో నిర్మిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వం ఫార్మాసిటీ కోసం 14వేల ఎకరాలు సేకరించింది. ఆ భూముల్లోనే ఫ్యూచర్‌సిటీ ఏర్పాటుకు కాంగ్రెస్ సర్కారు యత్నిస్తున్నది. మరో 16 వేల ఎకరాలను ఫ్యూచర్‌సిటీ కోసం సేకరించాల్సి ఉందని చెప్తున్నది. అందులో భాగంగానే మొండిగౌరెల్లిలో 821 ఎకరాలు, కందుకూరు మండలంలోని తిమ్మాపూర్‌లో 600 ఎకరాలు, పంజాగూడలో 300 ఎకరాలను సేకరించేందుకు సర్కారు ప్రయత్నాలు చేస్తున్నది.