హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగు, తాగునీరు అందించేందుకు వీలుగా తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల వరకు 80 టీఎంసీల జలాలను తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇరిగేషన్ అధికారుల ను ఆదేశించారు. మంగళవారం ఆయన సచివాలయంలో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి ఇరిగేషన్ ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో పలు ప్రాజెక్టుల పురోగతితోపాటు తమ్మిడిహట్టి నుంచి జలాల మళ్లింపుపై చర్చించారు. ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టులో భాగంగా గతంలో చేసిన పనులను వినియోగించుకునేలా తాజా ప్రణాళికలు ఉండాలని, తదనుగుణంగా అంచనాలను సిద్ధం చేయాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. సుందిళ్ల బరాజ్‌కు మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలని, శ్రీపాద ఎల్లంపల్లికి నీటిని తెచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు, అంచనాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
మొత్తంగా తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి కాకుండా సుందిళ్లకు 80 టీఎంసీలను మళ్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. అన్నారం, మేడిగడ్డ బరాజ్‌ల మరమ్మతులకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఆ పనులకు సంబధిత ఏజెన్సీలే బాధ్యత వహించేలా చూడాలని అధికారులకు సూచించారు. పూర్తిస్థాయి నివేదికలను ఆధారంగా చేసుకుని ప్రాజెక్టులవారీగా చేపట్టాల్సిన తదుపరి చర్యలపై నవంబర్ రెండో వారంలో మరోసారి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ఆనకట్టల భద్రతపై దృష్టి సా రించాలంటూ కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ రాసిన లేఖపై కూడా ఈ భేటీలో చర్చ జరిగింది. కేంద్రం నోటిఫై చేసిన 173 ఆనకట్టల భద్రతకు సంబంధించి ప్రాజెక్టుల వారీగా నివేదికలు తయారు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ భేటీలో సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.