చుట్టూ చిమ్మచీకటి.. ఆవరించిన నిశ్శబ్దం.. పైనుంచి పడుతున్న మట్టి.. పెరుగుతున్న నీటిమట్టం.. అడుగు వేయలేనంతగా బురద.. ఈ భీతావహస్థితిలో ఎస్ఎల్బీసీ సొరంగంలో మట్టి దిబ్బల 8 ప్రాణాలు! వాటికోసం ప్రయత్నిస్తున్న బృందాలు!72 గంటలైంది! ఆ కార్మికుల జాడ లేదు. ప్రమాద స్థలాన్నీ కనుగొనడం సాధ్యపడటం లేదు. ఫోన్లు రింగ్ అవుతున్నాయంటూ వచ్చిన వార్తలతో బతికుంటారనే ఆశ కలిగినా.. వారినుంచి స్పందన లేకపోవడంతో మళ్లీ నైరాశ్యం అలుముకున్నది. గాలి కూడా ఆడని పరిస్థితుల్లో మృత్యువుతో పోరాడుతున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి.
SLBC Tunnel Mishap | మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు మూడోరోజు రెస్క్యూ ఆపరేషన్ కొసాగింది. సోమవారం తాజాగా విశాఖపట్నం నుంచి నేవీ బృందం, ఐఐటీ చెన్నైకి చెందిన నిపుణులు, ఢిల్లీకి చెందిన ర్యాట్ మైనర్స్, గరుడ టీంతో పాటు తొమ్మిది రెస్క్యూ బృందాలు రేయింబవళ్లు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ముందుగా అనుకున్న విధంగా వర్టికల్ డ్రిల్లింగ్ ప్రతిపాదనకు స్వస్తి పలికారు. దెబ్బతిన్న కన్వర్‌కు మరమ్మతులు ప్రారంభించారు. సొరంగం నుంచి ఉబికి వస్తున్న నీరు, బురద సహాయక చర్యలకు తీవ్ర ఆటంకంగా మారాయి. ఫలితంగా లోపలికి రెస్క్యూ బృందం వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది.
వీటన్నింటినీ అధిగమించి మద్రాస్ ఐఐటీ నిపుణులు తీసుకొచ్చిన ప్రోబ్ కెమెరాలతో పాటు.. అత్యాధునిక టెక్నాలజీతోపాటు హై రిజల్యూషన్ కలిగిన ఆక్వా ఐ కెమెరాలను లోపలికి పంపించారు. డ్రోన్ కెమెరాలను ఉపయోగించినా ఫలితం కనిపించలేదు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి ఒక బృందం వెళ్లినా.. అక్కడ బురద, నీళ్లు మిషనరీ వల్ల తిరిగి వెనక్కి వచ్చారు. ఏ సమయంలోనైనా లోపలున్నవారిని గుర్తించే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఐదు అంబులెన్స్‌లను, డాక్టర్ల బృందాన్ని సిద్ధంగా ఉంచింది. హై రిజల్యూషన్ రిమోట్ కెమెరాలను పంపించి ఘటనా స్థలం మొత్తం రికార్డింగ్ చేయిస్తున్నారు. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ టీంలతోపాటు మిగతా బృందాలు నిర్విరామంగా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ చీఫ్ కమిషనర్ అరవింద్ కుమార్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, నాగర్‌కర్నూల్ కలెక్టర్ సంతోశ్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్‌తో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఆక్వా ఐ.. ఫ్లెక్సీ ప్రోబ్ పరికరాలపైనే ఆశలు
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు అత్యాధునిక పరికరాలను వా డుతున్నారు. మద్రాస్ ఐఐటీకి చెందిన సాంకేతిక నిపుణుల సహకారంతో రెస్క్యూ ఆపరేషన్ చేయనున్నారు. ఐఐటీ నిపుణులు ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఆక్వా ఐ కెమెరా హై రిజల్యూషన్‌తో కూడినది. ఇది నీటిలో సుమారు 50 మీటర్ల చుట్టుపక్కల ఉన్న వాటిని గుర్తిస్తుంది. బురదలో ఏ చిన్న వస్తువు ఉన్నా రికార్డ్ చేస్తుంది. ఈ కెమెరాతో లోపల చిక్కుకున్నవారి పరిస్థితిని తెలుసుకోవడంతోపాటు… ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్‌కు ఇది తోడ్పడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
రిమోట్ కెమెరాలతో నిఘా
ప్రోబ్ కెమెరా లోపలికి పంపించి ఆ చిత్రాల ఆధారంగా ఏం చేయాలన్న దానిపై నిపుణులు ఇచ్చిన సూచనలను పాటించి రెస్క్యూ చేసే అవకాశం ఉంది. మరోవైపు హై రిజల్యూషన్ కలిగిన కెమెరాలను కూడా పంపిస్తున్నారు.
విమర్శలతో వేగంగా సహాయక చర్యలు
ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తుండటంతో ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సహాయక చర్యలను ముమ్మరం చేసింది. దాదాపు మూడ్రోజుల తర్వాత మేల్కొన్న సర్కారు అందుబాటులో ఉన్న ఇతర చోట్ల జరిగిన ప్రమాదాలను గుర్తించి విజయవంతం చేసిన బృందాలను రప్పిస్తున్నది. ముందుగా ఖర్చుకు వెనకాడినా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సింగరేణితో ఫలితం లేదని భావించి ఇతర నిపుణులను రంగంలో దించాలని నిర్ణయం తీసుకున్నారు. అన్ని బృందాలను సమన్వయం చేస్తూ ముందుకుసాగితే చిక్కుకున్నవారిని రక్షించడంతోపాటు.. సొరంగ మార్గంలో షియర్ జోన్‌ను గుర్తించి ముందుకు వెళ్లొచ్చని నిర్ణయానికి వచ్చారు.
రంగంలోకి నేవీ బృందం
సొరంగంలో నీరు, బురద ఎక్కువగా ఉండడంతో వాటిని అధిగమించాలంటే నేవీ బృందంతోనే సాధ్యమవుతుందని భావించి విశాఖపట్నం నుంచి హుటాహుటిన వారిని రప్పించారు. ఈ బృందం రంగంలో దిగడంతో పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నారు. 14 నుంచి 11వ కిలోమీటర్ల వరకు లోకో రైలు పట్టాలు మునిగిపోయాయి. ఆదివారం 13 కిలోమీటర్ల లోపలికి చేరుకున్న రెస్క్యూ బృందం సోమవారం 11 కిలోమీటర్ల వరకు మాత్రమే వెళ్లగలిగింది.
గంట గంటకూ సమీక్ష..
విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్ గంటగంటకూ సమీక్ష నిర్వహిస్తున్నారు. బృందాలు ఏడుసార్లు టన్నెల్లో తనిఖీలు నిర్వహించినట్టు మీడియాకు వివరించారు. ఉత్తరాఖండ్‌లో జరిగిన విపత్తులలో ఈ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌ను సమర్థంగా నిర్వహించాయని తెలిపారు. కాగా, టన్నెల్లో సహాయ చర్యలను పర్యవేక్షించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సాయంత్రం జేపీ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఢిల్లీ నుంచి ర్యాట్ మైనర్స్ టీం
ఉత్తరాఖండ్‌లో జరిగిన ప్రమాదంలో ర్యాట్ మైనర్స్ టీం దాదాపు 41 మందిని రక్షించింది. 14 మంది ర్యాట్ (ర్యాట్ హోల్ టీమ్)మైనర్స్‌ను కూడా సహాయక చర్యల్లో ఉపయోగిస్తున్నారు. వీరితోపాటు టన్నెల్లో ఉన్నవారి ఆచూకీ తెలుసుకొనేందుకు స్నిఫర్ డాగ్స్‌లను రప్పించారు. అయితే, నీరు ఉన్నందున అవి లోపలికి వెళ్లలేకపోయాయి. ఇప్పటికే డ్యామేజీ అయిన కన్వేయర్ బెల్ట్‌కు మరమ్మతులు చేపట్టారు. కాగా, టన్నెల్ లోపలికి పై నుంచి రంధ్రం చేసి లోపలికి వెళ్లాలన్న (వర్టికల్ డ్రిల్లింగ్) ప్రతిపాదనను తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలో 5 గ్యాస్ కట్టింగ్ మిషన్లు రేయింబవళ్లు పని చేస్తున్నాయి.
ఫోన్ సిగ్నల్ దొరికినా కానరాని ఆచూకీ..
సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిలో కొంతమంది ఫోన్లు ఇంకా రింగ్ అవుతున్నాయని.. కానీ, రెస్పాన్స్ లేదని ఉన్నతాధికారులు అంటున్నారు. కాసేపటికి ఒకరిద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్‌గా వచ్చాయని వివరించారు. అయితే ఫోన్ రింగ్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేస్తే దోమలపెంట సమీపంలో చూపిస్తుందని.. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కచ్చితమైన లొకేషన్ గుర్తించేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని ఉన్నతాధికారులు ప్రకటించారు. మొత్తంగా రెస్క్యూ ఆపరేషన్ గంటగంటకు ఉత్కంఠను రేపుతున్నది.
బాధితులకు భరోసా
సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కుటుంబ సభ్యులకు ఎట్టకేలకు అధికారులు సమాచారం అందించారు. వారిని బయటికి తీసేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. చిక్కుకున్నవారిలో కొందరి కుటుంబ సభ్యులు దోమలపెంటకు చేరుకున్నారు. పరిస్థితులను జిల్లా కలెక్టర్ సంతోశ్ వారికి వివరించారు. తోటి కార్మికులను మీడియాకు దూరంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
మీడియాకు నో ఎంట్రీ
ఈ ప్రమాదంపై తెలుగు మీడియాతో పాటు జాతీయ మీడియా కూడా ఫోకస్ పెట్టింది. ఈ ఘటనను జాతీయ మీడియా ప్రముఖంగా ప్ర స్తావిస్తున్నది. అయితే మీడియా అడుగుతున్న ప్రశ్నలకు ఇటు మంత్రులు కాని.. అటు అధికార యంత్రాంగం కాని సరైన సమాధానాలు ఇవ్వడం లేదు. ఒక దశలో ప్రభుత్వం ఖర్చుకు వెనకాడుతున్నదని ఉన్నతాధికారులు మీడియా ముందు వాపోగా.. ఇది గమనించిన సర్కారు మీడియాను దూరం పెట్టాలని నిర్ణయించింది. మంగళవారం నుంచి మీడియాను పనులు చేపడుతున్న కాంట్రాక్టు కంపెనీ క్యాంపు కార్యాలయం వరకే అనుమతించనున్నారు. అక్కడే మీడియాకు బ్రీఫ్ చేస్తారని సమాచారం.