జహీరాబాద్, ఏప్రిల్ 8: ఓ ప్రైవేట్ స్కూల్ నిర్వాకంతో 8 మంది పదో తరగతి విద్యార్థులు బోర్డు పరీక్షలు రాయలేకపోయారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో చోటుచేసుకున్నది. పట్టణంలో రాంనగర్లోని ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ మీడియం ప్రైవేట్ స్కూల్ నర్సరీ నుంచి ఎస్సెస్సీ వరకు తరగతులు నిర్వహిస్తున్నది. ఈ ఏడాది ప్రభుత్వం నుంచి అనుమతి లేకపోయినా తరగతులు కొనసాగించింది. ఈ పాఠశాలలో పదో తరగతిలో మొత్తం 8 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారి నుంచి పాఠశాల యాజమాన్యం పరీక్ష ఫీజు కింద రూ.1000 చొప్పున వసూలు చేసింది. బోధన, ఇతర ఫీజుల కింద ఏడాదికి రూ.25 వేల చొప్పున వసూలు చేసింది.
విద్యార్థుల పరీక్ష ఫీజును భాను కోచింగ్ సెంటర్ పేరుతో నేరుగా తత్కాల్లో హైదరాబాద్లోని ఎస్సెస్సీ బోర్డులో చెల్లించిన స్కూల్ యాజమాన్యం సంగారెడ్డిలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఫీజు వివరాలను సమర్పించలేదు. అనుమానంతో ఎస్సెస్సీ బోర్డు అధికారులు దీనిపై విచారణ చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
ఈ విచారణలో పాఠశాలకు అనుమతి లేనట్టు గుర్తించి నివేదిక పంపారు. పర్యవసానంగా హాల్టికెట్లు మంజూరు కాలేదు. దీంతో రేపు మాపు అంటూ శనివారం వరకూ స్కూల్ యాజమాన్యం హాల్టికెట్లు ఇవ్వకుండా బుకాయిస్తూ వచ్చింది. పరీక్షలు కోల్పోయిన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించారు. విద్యాశాఖకు పూర్తి నివేదిక పంపించామని, ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటామని సంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి విజయ వివరణ ఇచ్చారు.