చారకొండ, జూన్ 19 : గురువారం తెల్లవారుజామున 5:30 గంటలకే ఇండ్లపైకి బుల్డోజ ర్లు.. అడ్డుకునేందుకు స్థానికుల యత్నాలు.. అ ప్పటికే మోహరించిన పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడం.. కష్టపడి కట్టుకున్న నిర్మాణాలు నేలమట్టమవడం.. మిన్నంటిన స్థానికుల రోదనలతో అయోధ్యనగర్లో ఉద్రిక్తత చోటుచేసుకున్నది. నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం సిరుసనగండ్ల సమీపంలోని అయోధ్యనగర్లో గల సీతారామచంద్రస్వామి ఆలయానికి చెందిన సర్వే నంబర్ 327లో 9.11 ఎకరాలు, మరో సర్వే నంబర్ 328లో 7.06 ఎకరాల్లో 50 ఏండ్ల నుంచి ఎందరో ఇక్కడే ఉంటూ జీవనాధారం పొందుతున్నారు. ఆలయ భూములను ఆక్రమించుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని అధికారులు కోర్టును ఆశ్రయించారు.
గతేడాది జనవరిలో ఆక్రమణలు తొలగించాలని కోర్టు తీర్పునిచ్చింది. అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో కోర్టు సీరియస్ అయ్యింది. ఈ క్ర మం లో రెవెన్యూ, పోలీస్, ఎండోమెంట్ అధికారు లు సమావేశమై వెంటనే కూల్చివేతలకు సిద్ధమయ్యారు. ఇండ్లవాసులకు ఒక్కరోజు గడువు ఇచ్చి.. ముగిసిన తర్వాత 8 జేసీబీలతో ఇండ్లపైకి వెళ్లారు. కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, డీఎస్పీ వెంకటేశ్వర్లు, అధికారుల ఆధ్వర్యంలో మొత్తం 34 నిర్మాణాలను గంటల్లోనే నేలమట్టం చేశారు.
అయోధ్యనగర్లో ఇండ్లను కూల్చివేస్తుం టే.. వద్దని బాధితులు అధికారులకు దండం పెట్టి.. కాళ్లావేళ్లా పడ్డారు. అయినా కనికరం లేకుండా కూల్చివేతలు కొనసాగించారు. అడ్డుకోవడానికి యత్నించినా పోలీసులు వారించారు. కొన్నిరోజులు సమయం ఇవ్వాలని వేడుకున్నా ఒప్పుకోలేదు. కనీసం ఇండ్లల్లోని సామగ్రిని తీసుకోవడానికి సమయం ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారు.