నాగర్‌కర్నూల్, మార్చి 1: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజామున 8 ఏసీ అంబులెన్స్‌లు ప్రత్యక్ష్యమయ్యాయి. ఆ వాహనాలు శుక్రవారం మధ్యరాత్రి అక్కడికి చేరుకున్నాయి. వాటిలో సిబ్బంది ఎవరూ లేరు. ఫ్రీజర్ మాత్రమే పెట్టుకొని పైలట్‌తో సిద్ధంగా ఉన్నాయి. దీంతో ప్రజల్లో అనుమానాలు రేకెత్తించాయి. దీంతో ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారనేది తేటతెల్లమైంది.
ఆ మృతదేహాల తరలింపునకే ఆ అంబులెన్స్‌లు వచ్చినట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. 8 మంది కార్మికులు చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించకపోయినా హైదరాబాద్ నుంచి తెప్పించిన ప్రైవేట్ అంబులెన్స్‌లు జిల్లా కేంద్రంలో ప్రత్యక్షమవడంతో సజీవ సమాధి అయ్యారనడానికి నిదర్శనమని చెప్పుకుంటున్నారు.
మృతదేహాలను వెలికితీసి రాత్రికి రాత్రే తరలించేందుకు అంబులెన్స్‌లను ముం దుగానే ఏర్పాటు చేశారా? అన్న అనుమానం కలుగుతున్నది. ఒక్కో మృతదేహానికి ఒక్కో అంబులెన్స్ చొప్పున వారి స్వరాష్ర్టాలకు పంపించేందుకు అధికారులు సైలెంట్‌గా ఏర్పాట్లు చేశారని సమాచారం. అంబులెన్స్‌ల విషయం తీవ్ర చర్చనీయాంశం కావడంతో అధికారులు వాటిని అక్కడి నుంచి మరోచోటుకు తరలించారు.