హైదరాబాద్, జనవరి 26 (నమస్తేతెలంగాణ): హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మువ్వన్నెల పతాకాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి ఆవిష్కరించారు. జాతీయ గీతాలపన చేస్తూ వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ హోంమంత్రి మహమూద్‌అలీ, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు నవీన్‌రెడ్డి, శంభీర్పూర్రాజు తదితరులు పాల్గొన్నారు.
రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆధ్వర్యంలో అజయ్, బషీర్ నేతృత్వంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ‘రాజ్యాంగ విద్రోహం.. రేవంత్ నిరంకుశ పాలన-రాహుల్ మౌనం’ పేరిట లఘు నాటికను ప్రదర్శించారు. రేవంత్‌రెడ్డి రెండేళ్ల పాలనలో రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్న తీరును ఎండగట్టారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతూ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న రాహుల్‌గాంధీ వైఖరిని ఎత్తిచూపారు. సీఎం రేవంత్‌రెడ్డి నిస్సిగ్గుగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న తీరు..ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నోట్ల కట్టలతో కొనుగోలు చేస్తున్న వైనాన్ని కండ్లకు కట్టారు..మెస్సీ ఫుట్‌బాల్ మ్యాచ్ ముసుగులో ఆయన చేస్తున్న దుబారాను ఎలుగెత్తిచాటారు..జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులకు చేసిన మోసాన్ని దృశ్యరూపకంగా వివరించి ఆకట్టుకున్నారు.
బోనస్ ఇవ్వకుండా, రైతుబంధు జమచేయ కుండా రైతులకు కాంగ్రెస్ సర్కారు చేస్తున్న ద్రోహాన్ని విడమరిచి చెప్పారు. కాంగ్రెస్ అరాచక పాలనను తెలంగాణ ప్రజలందరూ ఏకమై ఎదిరించాల్సిన సమయం ఆసన్నమైం దని ఈ నాటిక ద్వారా గొప్ప సందేశాన్ని ఇచ్చారు. ఈ నాటికను ప్రదర్శించిన విద్యార్థులు, నిర్వాహకుడు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ను కేటీఆర్ అభినందించారు. వారికి శాలువాలు కప్పి సత్కరించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మండలి విప్ దేశపతి శ్రీనివాస్, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, మహిళా నేతలు సుమిత్రా ఆనంద్, రాసూరి సునీత, సుశీలారెడ్డి, షకీలారెడ్డి తదితరులు ఉన్నారు.