హైదరాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్‌కు పరిపాలనపై కనీస అవగాహన లేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (Peddi Sudarshan Reddy) విమర్శించారు. రాష్ట్రంలో రైతులందరికి రుణమాఫీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వేలాది మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, పల్లె రవికుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రకరకాల కారణలతో రైతులకు రుణాలు మాఫీ చేయడం లేదని విమర్శించారు. రుణమాఫీ కోసం బీఆర్ఎస్ తరఫున కాల్ సెంటర్ పనిచేస్తుందన్నారు.
ఇప్పటివరకు మాఫీపై సుమారు 75 వేల ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఇంకా చాలామంది రైతులు ఆగస్టు 15 కోసం చూస్తున్నారని చెప్పారు. 15వ తేదీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పల్లెల్లో పర్యటించడం అనుమాణమేనని తెలిపారు. రుణమాఫీ కోసం రూ.45 వేల కోట్లు అవసరముంటే.. రూ.18 వేల కోట్లతోనే మమ అనిపించాలని చూస్తున్న ప్రభుత్వ కుట్రలు రైతులకు అర్థమవుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ 9 నెలల పాలనలో రూ.50 వేల కోట్ల అప్పు అయిందన్నారు. త్వరలో కాంగ్రెస్ నేతల అరాచకాలను బయటపెడతామని చెప్పారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు.
కాగా, పోలీసుల పహారా మధ్య కాంగ్రెస్ పాలన సాగుతున్నదని ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలను తిట్టడమే కాంగ్రెస్ నాయకులు పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ హయాంలో కొనుగోలు చేసిన బస్సులకు హస్తం పార్టీ నేతలు రిబ్బన్ కట్చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
Live: BRS Leaders Press Meet at Telangana Bhavan. https://t.co/IHNY4tD46L
— BRS Party (@BRSparty) August 13, 2024