Teachers | హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : అమ్మలే చదువులమ్మలుగా స్థానం సంపాదించారు. రాష్ట్రంలోని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేవారిలో అత్యధికంగా మహిళలే ఉన్నారు. మొత్తం టీచర్లలో 63శాతం మహిళలే ఉండటం విశేషం. ప్రైవేట్ పాఠశాలల్లో కూడా 74శాతం మంది మహిళా టీచర్లే. ఆసక్తికరమైన ఈ విషయాన్ని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టం ఆన్ ఎడ్యుకేషన్ (యూ డైస్) ప్లస్ నివేదిక ఇటీవలే వెల్లడించింది.
రాష్ట్రంలోని అన్ని రకాల బడుల్లో 3,41,460 టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో 2,15,325 టీచర్లు(63శాతం) మహిళలే. మరో 1,26,135 (34శాతం) పురుష టీచర్లు పనిచేస్తున్నారు. ఇక ప్రైవేట్లో 74.81శాతం మహిళా టీచర్లుండగా, కేవలం 26శాతం మాత్రమే పురుషులు పనిచేస్తున్నారు. ఎయిడెడ్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. అయితే సర్కారు బడుల్లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. అత్యధికంగా పురుష టీచర్లు పనిచేస్తుండగా, మహిళా టీచర్లు పురుషుల కంటే తక్కువగా ఉన్నారు. మొత్తంగా ఎల్కేజీ, యూకేజీ వంటి ప్రీ ప్రైమరీలో 6,038 టీచర్లుంటే 5,934 మంది మహిళలు కాగా, కేవలం 104 మంది పురుషులున్నారు. ప్రాథమిక తరగతుల్లో మొత్తం 1,03,074 టీచర్లకు 72,499 మహిళలు కాగా, 30,575 పురుషులు పనిచేస్తున్నారు.