హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం సర్కారు తొందరపడుతున్నది. మొదటి దశ విస్తరణ కోసం ఇతర సంస్థలకు చెందిన వందలాది ఎకరాలను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు హడావుడిగా బదిలీ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని హిమయత్సాగర్, కిస్మత్పుర, ప్రేమావతిపేట్, బుద్వేల్, కొత్వాల్‌గూడలోని 734 ఎకరాల ఇతర సంస్థలకు చెందిన భూములను కార్పొరేషన్‌కు మళ్లించింది. ఈ భూముల్లో ఉన్న సంస్థలను కొత్త ప్రదేశాలకు తరలించి, రేపోమాపో కూల్చివేతలు మొదలుపెట్టనున్నారు.
వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ ట్రెయినింగ్ ఇన్స్టిట్యూట్కు చెందిన 128.39 ఎకరాలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్‌కు చెందిన 41 ఎకరాలు, వ్యాలీ స్కూల్, అటవీ శాఖకు చెందిన 99 ఎకరాలు, ఇతర సర్కారు సంస్థలు, కొత్వాల్‌గూడలో 167 ఎకరాల జనరల్ గవర్నమెంట్ ల్యాండ్‌ను కూడా గుర్తించారు. రాజేంద్రనగర్, హిమాయత్‌సాగర్, బుద్వేల్ ప్రాంతాల్లో 20 కిలోమీటర్ల విస్తరణంలో పార్కులు, వాక్‌వేలు, సాంస్కృతిక కేంద్రాలు, గ్రీన్ కారిడార్ల నిర్మాణానికి ఈ 734 ఎకరాలను వినియోగిస్తామని ప్రభుత్వం చెప్తున్నది. వీటి కోసం ఏకంగా రూ.5,641 కోట్ల బడ్జెట్లో ఏషియన్ డెవలప్మెంట బ్యాంక్ నుంచి రూ.4100 కోట్ల రుణం తీసుకోనుంది. ఆ నిధులతో గేట్వేలూ, కృత్రిమ బీచ్‌లు, ఇతర వసతులను నిర్మిస్తామని చెప్తున్నది. గుర్తించిన ల్యాండ్ బ్యాంక్‌లో కూల్చివేతలు చేపట్టి, ఆ తర్వాత నిర్మాణ పనులు మొదలుపెట్టే యోచనలో సర్కారు ఉంది.