ఘనత వహించిన ముఖ్యమంత్రి గారి నోట అమూల్యమైన మాట వినిపించింది. కన్నెపల్లిలో పంపులు నడిపితే.. తెలంగాణ మునిగిపోతదట! గ్రామాలు కొట్టుకుపోతాయట! భద్రాచలమూ నీటమునుగుతదట! గోదావరి-ప్రాణహిత మహోధృతంగా ప్రవహించినప్పుడూ కాళేశ్వరం కాలపరీక్షకు తట్టుకొని నిశ్చలంగా నిలబడింది. 2022లో మేడిగడ్డ బరాజ్ గరిష్ఠంగా 28 లక్షల క్యూసెక్కుల వరదను కూడా తట్టుకోగలిగింది. 105 మీటర్ల నీటిమట్టంతో గోదావరి పారినప్పుడు గ్రామాలు, పొలాలు మునిగిపోలేదు. అంతటి వరదల్లోనూ, గరిష్ఠంగా ఎత్తిపోతలు కొనసాగినప్పుడూ కాలువల కట్టలు తెగిపోలేదు.
ఈ క్షణానికి మేడిగడ్డ వద్ద 70వేల క్యూసెక్కుల వరద పారుతున్నది. అంటే ఆరు టీఎంసీలు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసినా.. తెలంగాణ రైతు నెత్తిన పాలుపోసినట్టే. కానీ రెండు మోటర్లతో రెండు టీఎంసీలు ఎత్తిపోస్తే తెలంగాణ మునిగిపోతుందనడం.. అవగాహనలేమికి నిదర్శనం. అజ్ఞానానికి పరాకాష్ట. అందుకే రేవంత్ సర్కార్ తీరుపై రాష్ట్ర రైతాంగంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. పట్టిసీమకు పారిచ్చేందుకే ఇక్కడ నీళ్లను వదిలిపెడుతున్నారనే సందేహాలు మరింత బలపడుతున్నాయి.
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ)/ హనుమకొండ, జూలై 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఉమ్మడి రాష్ట్రం తరహాలోనే పరిపాలన సాగిస్తున్నది. తెలంగాణ రైతులను కష్టపెడుతూ ఆంధ్రపదేశ్ ప్రయోజనాల కోసం పని చేస్తున్నది. గోదావరి నీటి వినియోగంలో పూర్తిగా సమైక్య రాష్ట్రంలోని విధానాన్నే అనుసరిస్తున్నది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గోదావరి జలాలను ఒడిసిపట్టి తెలంగాణలోని పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టులను వినియోగించుకోకుండా నీటి వనరులను ఆంధ్రప్రదేశ్‌కు వదిలిపెడుతున్నది. రెండు కీలక ప్రాజెక్టులను పడావు పెడుతూ తెలంగాణలోని సాగు భూములను ఎండబెడుతున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానం ఇక్కడి రైతులకు శాపంగా మారింది. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయానికి కీలకమైన రెండు కార్తెలు ముగిశాయి. పంటల సాగుకు అదును మించిపోతున్నది. సాగునీటి వ్యవస్థ లేక వరితోపాటు ఏ పంటలు కూడా వేయలేని పరిస్థితి నెలకొన్నది. కరువు కమ్ముకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుతో పంటలకు నీరు అందించే ఆలోచన చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
మేడిగడ్డ నుంచి బస్వాపూర్ వరకు
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కీలకమైన మేడిగడ్డ(లక్ష్మీ) బరాజ్ ఎగువ కన్నెపల్లి పంపులను ఆన్ చేస్తే ప్రాణహిత జలాలను ఒడిసిపట్టవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మొదలై యాదాద్రి జిల్లా బస్వాపూర్ రిజర్వాయర్ వరకూ మళ్లించవచ్చు. మేడిగడ్డ నుంచి అన్నారం, అన్నారం నుంచి సుందిళ్ల, సుందిళ్ల నుంచి ప్రధాన గోదావరిపై నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు తరలించుకోవచ్చు. ఎల్లంపల్లి నుంచి నందిమేడారం, నందిమేడారం నుంచి లక్ష్మీపూర్, లక్ష్మీపూర్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా రాజరాజేశ్వర జలాశయం, ఆపై అక్కడినుంచి అంతగిరి(అన్నపూర్ణ) రిజర్వాయర్‌కు అక్కడినుంచి రంగనాయకసాగర్‌కు, తద్వారా కొమురవెల్లి మల్లన్నసాగర్, అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్వరకు తరలించుకోవచ్చు. అందుకు కావాల్సిన నీటిసరఫరా వ్యవస్థ మొత్తం సిద్ధంగా ఉన్నది. తద్వారా ఎత్తిపోతలతో కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, యాదాద్రి, సంగారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, మేడ్చల్, నల్లగొండ, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలకు సాగునీటిని అందించడంతోపాటు మిషన్ భగీరథ ద్వారా తాగునీటికి ఢోకా లేకుండా చేయవచ్చు. ఆయా రిజర్వాయర్లను వాటి పరిధిలోని వేలాది చెరువులతోపాటు, చెక్‌డ్యామ్‌లను సైతం అనుసంధానం చేయడం వల్ల అన్నీ నింపుకొనే అవకాశం ఇప్పటికీ తెలంగాణకు ఉన్నది.
నిజాంసాగర్.. ఎగువ మానేరు.. మల్కపేటకు..
కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఎగువమానేరులోనూ జలాలను నింపుకోవచ్చు. మల్లన్నసాగర్ నుంచి జలాలను కూడవెల్లి వాగులోకి వదిలితే.. తద్వారా అవి ఎగువ మానేరుకు చేరుకుంటాయి. అదేవిధంగా కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి జలాలను హల్దీ వాగుద్వారా చారిత్రక నిజాంసాగర్‌కు తరలించి ప్రాణం పోయవచ్చు. రాజరాజేశ్వర జలాశయం ద్వారా జలాలను కాళేశ్వరం ప్రాజెక్టు లింకు 3 ద్వారా ప్రస్తుతం 3 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న మల్కపేట రిజర్వాయర్‌కు సైతం మళ్లించవచ్చు.
కక్షతో కన్నెపల్లిని పక్కనబెట్టి..
ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణ రైతాంగానికి ఆదరువుగా నిలిచే కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. కాళేశ్వరంలోని కీలకమైన కన్నెపల్లి పంపుహౌస్ వద్ద నుంచి పంపింగ్ చేసేందుకు 93 మీటర్ల నీటి మట్టం ఉండాలి. ప్ర స్తు తం కన్నెపల్లి వద్ద 97.70 మీటర్ల మేరకు నీటి మట్టం ఉన్నది. ఎగువ రాష్ర్టాల్లో కురిసిన వానలతో కాళేశ్వరం వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతున్నది. ఈ సాగునీటి వ్యవస్థకు కీలకమైన కన్నెపల్లి పంపుహౌస్ వద్ద ఇప్పుడు సరిపడా నీటి ప్రవాహం ఉన్నది. కన్నెపల్లి పంపుహౌస్‌లోని 17 మోటర్ల ద్వారా గోదావరి నీటిని నిత్యం రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతానికి తరలించవచ్చు. కన్నెపల్లి పంపుహౌస్ వద్ద మోటర్లతో గోదావరి నీటిని అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి ప్రాజెక్టులతోపాటు, పైన పేర్కొన్న రిజర్వాయర్లు, ప్రా జెక్టులన్నీ నింపుకోవచ్చు. మేడిగడ్డతో సంబంధం లే కుండానే పూర్తి చేసేలా కాళేశ్వరం నిర్మించారు. ప్రస్తు తం కరువు పరిస్థితులు నెలకొన్నా మరోవైపు ప్రాణహితలో పుష్కలంగా జలాలు అందుబాటులోకి వస్తున్నాయి. వాటి ని ఎత్తిపోసే అవకాశమున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. రాష్ట్రంలోని రైతులతో చెలగాటమాడుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తెస్తే దాన్ని నిర్మించిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే రాష్ట్రంలోని రైతులను కరువుకు వదిలి పెడుతున్నదని స్పష్టంగా తెలిసిపోతున్నది.
దేవాదుల మరీ
గోదావరి జలాల వినియోగం విషయంలో కాంగ్రె స్ ప్రభుత్వ తీరు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేతీరుగా ఉంటున్నది. కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగిస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందనే ఉద్దేశంతో దీన్ని పడావుబెడుతున్న కాంగ్రెస్ సర్కార్.. కేసీఆర్ పూర్తిచేసిన దేవాదుల ప్రాజెక్టు విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు బరాజ్ లేకుండా దేవాదుల ప్రాజెక్టు నిర్మించాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ఈ ప్రాజెక్టు స్వరూపాన్ని పూర్తిగా మార్చారు. దేవాదుల ప్రాజెక్టులో ఏడాది పొడవునా గోదావరి జలాలను పంపింగ్ చేసేందుకు వీలుగా సమ్మక్క బరాజ్‌ను నిర్మించారు. దేవాదుల ప్రాజెక్టులోని ఒకటో దశలో 5.18 టీఎంసీలు, రెండో దశలో 7.25 టీఎంసీలు… మూడో దశలో 25.75 టీఎంసీల నీటిని ఏడాది పొడవునా పంపింగ్ చేసేలా కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసింది. సమ్మక్క బరాజ్ నిర్మాణంతో దేవాదుల పరిధిలోని 5.57 లక్షల ఎకరాలు, ఎస్సారెస్పీ పరిధిలోని 7.50 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ అయ్యింది. పది మోటర్లతో నిత్యం పంపింగ్ జరిగేలా విస్తరించారు. దేవాదుల పంపుహౌస్ వద్ద 71 మీటర్ల నీటి మట్టం ఉన్నప్పుడు పంపింగ్ చేయవచ్చు. ప్రస్తుతం ఇక్కడ 75 మీటర్ల మేరకు జలాలు ఉన్నాయి. సమ్మక్క బరాజ్ వద్ద బుధవారం 1.06 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగింది. ప్రస్తుత నీటి మట్టం ప్రకారం రోజూ 2,542 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేయవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం దేవాదుల నీటిని వృథాగా కిందికి వదిలిపెడుతున్నది. ఉమ్మడి వరంగల్, మెదక్, నల్లగొండ జిల్లాల్లోని భూముల్లో పంటలు వేయకుండా బీడుగా పెట్టే పరిస్థితి తెచ్చింది.
కన్నెపల్లి అష్టదిగ్బంధనం
సాగు, తాగునీరు, పరిశ్రమలకు అవసరమైన జలవనరులను అందించేందుకు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తేకుండా రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం కష్టపెడుతున్నది. కన్నెపల్లి పంపుహౌస్ వద్ద నీటి ప్రవాహం విషయాన్ని దాచిపెట్టేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లి పంపుహౌస్‌ను అష్టదిగ్బంధనం చేసింది. కన్నెపల్లి పంపుహౌస్ చుట్టూ దాదాపు పది కిలోమీటర్ల మేర రోడ్లపై అన్ని వైపులా పోలీసులను పెద్దం సంఖ్యలో మోహరించింది. ఎలాంటి రాకపోకలు లేకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కాళేశ్వరం ఆలయానికి వచ్చి వెళ్లే వారు సైతం కన్నెపల్లి సమీపంలోకి వెళ్లకుండా పోలీస్ చెక్‌పోస్టులను పెట్టి కట్టుదిట్టం చేసింది. కన్నెపల్లి పంపుహౌస్ వద్ద నీటి ప్రవాహం, నీటిమట్టం విషయాలు బయటకు తెలి స్తే.. పంటలకు సాగునీరందకుండా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభు త్వ తీరుపై రైతులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తారనే ఇప్పుడు ఆంక్షల విధానం అమలు చేస్తున్నది. దీంట్లో భాగంగానే కన్నెపల్లి పంపుహౌస్ వద్దకు ఎవరూ వెళ్లకుండా చేస్తున్నది. మహదేవపూర్ నుంచి కాళేశ్వరం, కన్నెపల్లి పంపుహౌస్‌కు వెళ్లే అన్ని మార్గాల్లోనూ రాకపోకలపై ఆంక్షలు విధించింది. ఆ ప్రాంతం అంతా ఇప్పుడు పోలీసు వలయంలోనే ఉన్నది. సాగునీటి శాఖ అధికారులతో వివరాలు తెలుసుకున్న తర్వాతే కన్నెపల్లి పంపుహౌస్ కాంపౌండ్‌లోకి అనుమతిస్తున్నది.
ఎస్సారెస్పీకి తరలించవచ్చు.. వరదకాలువను నింపుకోవచ్చు..
ఇక ప్రస్తుతం ఎగువ నుంచి భారీ వరద ప్రవాహాలు లేకపోవడంతో ఎస్సారెస్పీ బోసిపోతున్నది. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో లిఫ్ట్ చేసే జలాలను ఎస్సారెస్పీకి తరలించుకొని జలాలను వినియోగించుకొనే అవకాశమున్నది. కరువనేది ఉండకూడదనే ఉద్దేశంతోనే నాడు ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకాన్ని నాడు కేసీఆర్ చేపట్టారు. అందులో భాగంగా వరద కాలువ నుంచి ఎగువన రాంపూర్, రాజేశ్వర్రావుపేట, ముప్కాల్ పంప్‌హౌస్‌ల ద్వారా ఎస్సారెస్పీలోకి ప్రాణహిత జలాలను తరలించుకోవచ్చు. ఆ పంపింగ్ వ్యవస్థను గతంలోనే ప్రారంభించారు. ఇప్పటికీ అన్నివిధాలా అది సిద్ధంగా ఉన్నది. స్విచ్ ఆన్ చేస్తే జలాలు తరలిపోతాయి. ఇక 122 కి.మీ పొడవైన ఎస్సారెస్పీ వరద కాలువలోనూ దాదాపు 1.7 టీఎంసీల వరకు జలాలను నిల్వ చేయవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 34 ఓటీలను వరదకాలువపై ఏర్పాటు చేసి దాదాపు 157 చెరువులను అనుసంధానించింది. ఆ చెరువులకు జలాలను తరలించుకోవచ్చు.
పట్టిసీమలో కొనసాగుతున్న ఎత్తిపోతలు
రేవంత్ సర్కార్ ఎన్డీఎస్ఏ నివేదిక పేరిట రాద్ధాంతం చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెడుతున్నది. ప్రాణహిత జలాలను ఒడిసిపట్టే అవకాశమున్నా దిగువకు వదిలిపెడుతున్నది. కానీ పొరుగున ఏపీ ప్రభుత్వం ఎల్ నినో నేపథ్యంలో అప్రమత్తమైంది. రైతులను ఆదుకోవడమే ఎజెండాగా ముందుకు సాగుతున్నది. వాస్తవంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నాణ్యతపై అనేక ఆరోపణలున్నాయి. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఇటీవల వరదతో నిర్మించిన అదనపు డయాఫ్రమ్‌వాల్ నాణ్యతపై అక్కడి రాజకీయ పక్షాలు ఆరోపణలకు దిగాయి. కేంద్ర సంస్థలు, అంతర్జాతీయ సంస్థలతో డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణంపై చర్యలు చేపట్టింది. ఇప్పటికీ ఆ వివాదాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం ఆ వివాదాలన్నీ పక్కకు నెట్టి అందుబాటులో ఉన్న జలాలను ఒడిసిపట్టేందుకు ఏపీ సర్కార్ పూనుకున్నది. గోదావరి నుంచి ఎత్తిపోతలు ప్రారంభించింది. పోలవరం డ్యామ్ పూర్తయ్యే వరకు కుడికాలువ ద్వారా గోదావరి జలాలను తరలించేందుకు తాత్కాలికంగా ఏలూరు జిల్లాలో పట్టిసీమ లిఫ్ట్ స్కీమ్‌ను ఏపీ గతంలోనే చేప్టటింది. అక్కడ 4 మెగావాట్ల సామర్థ్యమున్న 24 పంపులు ఏర్పాటు చేసింది. తద్వారా ప్రస్తుతం రోజుకు 8,500 క్యూసెక్కుల జలాలను గోదావరి నుంచి లిఫ్ట్ చేసి కుడి కాలువ ద్వారా జలాలను కృష్ణా డెల్టా ఆయకట్టుకు 80 టీఎంసీల మేర తరలించడం ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. అదేవిధంగా పోలవరం కుడికాలువకు సమాంతరంగా తాడిపూడి కాలువను సైతం నిర్మించింది. తాడిపూడి లిఫ్ట్ ద్వారా ఇక్కడా 1,400 క్యూసెక్కుల తరలింపును ప్రారంభించింది. సామర్థ్యం మేరకు గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు సిద్ధమైంది.
వరదను వదిలి.. బురద రాజకీయం

నిక్షేపంగా మోటర్లు.. ఇదీ నిజం

కన్నెపల్లి పంప్‌హౌస్‌లో ఇప్పటికీ బురద ఉన్నదంటూ నాలుగేండ్ల కిందటి ఫొటోను ఇటీవల మీడియాకు చూపుతున్న సీఎం రేవంత్.. శుక్రవారం కన్నెపల్లి పంప్‌హౌస్‌లోని పరిస్థితి ఇదీ. గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు సిద్ధంగా, నిక్షేపంగా ఉన్న మోటర్లు
చిన్నబోయిన కన్నెపల్లి పంపులు

మేడిగడ్డ వద్ద 70వేల క్యూసెక్కుల వరద పారుతున్నది. ఒకవైపు పంటలు ఎండుతున్నాయని రైతులు గగ్గోలు పెడుతున్నా పెడచెవిన పెట్టిన ప్రభుత్వం.. ఉన్న నీళ్లనూ లిఫ్ట్ చేయడం లేదు. ఫలితంగా జలసవ్వడులతో మార్మోగాల్సిన కన్నెపల్లి పంపులు శుక్రవారం ఇలా చిన్నబోయాయి.
పట్టిసీమలో పంపింగ్ పరుగులు

ఎగువనుంచి భారీగా వస్తున్న వరదను ఎత్తిపోయలేక రేవంత్ సర్కార్ దిగువకు వదిలిపెడుతున్నది. అదేసమయంలో గోదావరి నీటిని ఏపీ ఒడిసిపట్టుకుంటున్నది. 24 మోటర్ల పట్టిసీమ పంపులు వరదనీటిని ఎత్తిపోస్తున్నాయి.
గోదావరి బేసిన్లో కాళేశ్వరం ప్రాజెక్టు నింపగలిగే ప్రధాన జలాశయాలు.. (టీఎంసీల్లో)
రిజర్వాయర్ నిల్వ – ప్రస్తుత సామర్థ్యం నిల్వ