హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ) : ఇకపై ప్రతి రైస్‌మిల్లు కచ్చితంగా సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్)లో భాగస్వామ్యం కావాల్సిందే. కాదు కూడదంటే ఇకపై కుదరదు. ప్రైవేటు వ్యాపారం చేసుకున్నా.. సీఎంఆర్లోనూ ఉండాల్సిందే. ఈ మేరకు సీఎంఆర్ నిబంధనల్లో సివిల్ సైప్లె కొత్త నిబంధనలను అమలు చేయనున్నది. ఇటీవల విడుదల చేసిన పాక్షిక ప్రొక్యూర్మెంట్ పాలసీలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మొత్తంగా కాకపోయినా.. మిల్లు కెపాసిటీలో కనీసం 50శాతం సీఎంఆర్ ఇవ్వాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు కొన్ని మిల్లులు పూర్తిగా ప్రైవేటు వ్యాపారం చేసుకుంటూ సీఎంఆర్‌కు నిరాకరించేవి. ఈ సీజన్ నుంచి మిల్లులకు సీఎంఆర్ మినహాయింపులను తొలగించింది.
కొత్తపాలసీలో సివిల్ సైప్లె మిల్లర్లకు షాక్ ఇచ్చింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం కచ్చితంగా సీఎంఆర్ 67శాతం బియ్యం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. మిల్లర్లు మాత్రం సన్న ధాన్యానికి 67శాతం బియ్యం రాబోవని మొత్తుకుంటున్నారు. అయినప్పటికీ సివిల్ సైప్లె వారి విజ్ఞప్తులను బుట్టదాఖలు చేస్తూ నిబంధనల ప్రకారం సీఎంఆర్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మిల్లులు ఎంత ధాన్యం దించుకుంటే అందులో 10-25శాతం వరకు విలువను బ్యాంకు గ్యారంటీగా సివిల్ సైప్లెకి అందించాల్సి ఉంటుంది.
సీఎంఆర్‌లో అవకతవకలకు చెక్‌పెట్టేవిధంగా సివిల్‌సైప్లె సంస్థ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. ధాన్యం, మిల్లింగ్‌కు సంబంధించి ఇకపై ప్రతి మిల్లు కచ్చితంగా రెండు రికార్డులను నిర్వహించాలని అదేశించింది. ఇందులో ఒక రికార్డులో సివిల్ సైప్లె ఇచ్చిన ధాన్యం వివరాలు, సీఎంఆర్ వివరాలను పొందుపరచాలి. మరో రికార్డులో మిల్లులు సొంతంగా చేసుకునే వ్యాపారానికి సంబంధించిన ధాన్యం కొనుగోళ్ల వివరాలను కచ్చితంగా పొందుపరచాలని పేర్కొన్నది.
ఒకవైపు ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినట్టు ప్రకటించిన సివిల్ సైప్లె మరోవైపు కొనుగోళ్లకు సంబంధించి పూర్తిస్థాయి పాలసీని విడుదల చేయకపోవడం గమనార్హం. పూర్తి పాలసీ లేకుండా ఏ విధంగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆగస్టులో విడుదల చేయాల్సిన పాలసీని అక్టోబర్ పూర్తవుతున్నా విడుదల చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొనుగోళ్లను ఆలస్యం చేసేందుకే పాలసీని తీసుకురావడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాలసీ లేకపోవడం వల్ల ఇప్పటి వరకు మిల్లర్లతో ఒప్పందాలు పూర్తి కాలేదు. దీంతో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం ఎక్కడికి పంపిస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.