హైదరాబాద్, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ) : రైతుల నుంచి వానకాలం ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు తప్పేలా లేవు. సివిల్ సైప్లె సేకరించిన ధాన్యాన్ని మిల్లుల్లో దించుకోబోమని రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. సన్న బియ్యం సీఎంఆర్, బకాయిలతో పాటు వేధింపుల సమస్యలు పరిష్కరించే వరకు ఎట్టిపరిస్థితుల్లోనూ ధాన్యం తీసుకోబోమని స్పష్టంచేశారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో రైస్ మిల్లర్ల అసోసియేషన్ తరుపున కలెక్టర్లకు వినతిపత్రాలు అందిస్తున్నారు. ఇప్పటికే తమ సమస్యలను సివిల్ సైప్లె ఉన్నతాధికారులకు విన్నవించామని, కానీ ఎలాంటి పరిష్కారం లభించలేదని మిల్లర్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ధాన్యం దించుకోవద్దనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. మిల్లర్ల అల్టిమేటం నేపథ్యంలో అక్టోబర్ మొదటివారం నుంచి ప్రారంభమయ్యే కొనుగోలుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ధాన్యం కొనుగోళ్లు కష్టమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి.
సన్నధాన్యం దించుకోవడం, సన్నధాన్యానికి 67శాతం సీఎంఆర్ ఇవ్వడంపై మిల్లర్లు ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్ నుంచి సన్న ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తామని ప్రభు త్వం ప్రకటించింది. జనవరి నుంచి రేషన్‌లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని కూ డా హామీ ఇచ్చింది. ఇక్కడే అసలు సమస్య ప్రారంభమైంది. రైతుల నుంచి సేకరించిన సన్న ధాన్యాన్ని సివిల్ సైప్లె మిల్లర్లకు ఇస్తుంది. నిబంధనల ప్రకారం మిల్లర్లు సన్నధాన్యం రా రైస్‌కు 67శాతం సీఎంఆర్(100 కిలోల ధాన్యానికి 67కేజీల బియ్యం) ఇవ్వాలి. కానీ సన్న ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 55-58 కేజీలు మాత్రమే బియ్యం వస్తాయని మిల్లర్లు చెబుతున్నారు. మిగిలిన 9 నుంచి 12 కేజీల సన్న బియ్యంను తాము ఏ విధంగా ఇవ్వాలని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 17శాతం తేమతో సన్న ధా న్యాన్ని కొనుగోలు చేస్తారని, 45 రోజులకు మించి నిల్వ చేయలేమని చెబుతున్నారు.