హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టీసీలో కార్మికులకు సత్వర న్యాయం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. చిన్నచిన్న తప్పులకు ఆర్టీసీ యాజమాన్యం పెద్దపెద్ద శిక్షలు విధించడంతో కార్మికులు లేబర్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కార్మికుల సమస్యల పరిషారం కోసం, సత్వరన్యాయం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన న్యాయస్థానాల్లో సరిపడా జడ్జీలు లేక కార్మికుల గోడు వినిపించుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారు. నాంపల్లిలోని లేబర్ కోర్టులో ఆరుగురు న్యాయమూర్తులు ఉండాల్సిన చోట ఒకరు మాత్రమే ఉన్నారు. వరంగల్, గోదావరిఖనిలోనూ ఇదే పరిస్థితి. ఇన్చార్జి జడ్జీలతో కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వేలాది కార్మికుల కేసులు వాయిదాలకే పరిమితం అవుతున్నాయి.
కార్మికుల మెడపై 18 గంటల పని కత్తి
రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్టీసీలో 57,500 మంది కార్మికులు పనిచేసేవారు. పదవీ విరమణ చేసినవారు పోనూ.. ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్య 38,000కి పడిపోయింది. మిగిలిన 20వేల మంది పనిభారం ప్రస్తుతం డ్యూటీ చేస్తున్న వారిపైనే పడింది. తగ్గిన ఉద్యోగాలను భర్తీ చేయకపోవడంతో రోజుకు 12 నుంచి 18 గంటల వరకు డ్యూటీ చేయాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించినవారిని చిన్న కారణాలకే అక్రమంగా విధుల నుంచి తొలగిస్తున్నట్టు కార్మికులు వాపోతున్నారు. ఈ మధ్యకాలంలో అటు ప్రజాభవన్‌కు, ఇటు సెక్రెటరియేట్‌కు, బస్ భవన్‌కు సుమారు 600 మంది కార్మికులు ఏడాదిన్నరగా తిరుగుతున్నారు. తమను అన్యాయంగా విధుల నుంచి తొలగించారని, తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
త్రిసభ్య కమిటీ వేసినా ఫలితంలేదు
ఆర్టీసీ కార్మికులకు అన్యాయం జరిగిందని రిమూవల్ కార్మికులంతా ఏడాదిపొడవునా పోరాడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్ అధికారితో కమిటీ ఏర్పాటుచేసింది. కేసులను పరిశీలించిన కమిటీ.. తొలగించిన వారికి అన్యాయం జరిగిందని.. వారందరిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సూచించింది. దీంతో ఆ సూచనను ఆర్టీసీ యాజమాన్యం బస్‌భవన్‌లోనే తొక్కిపెట్టింది. నామమాత్రంగా కేవలం 8 మందికి ఉద్యోగాలు ఇచ్చి.. మిగతావారిని బస్‌భవన్ చుట్టూ తిప్పుకుంటున్నదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అడ్డగోలుగా విధుల నుంచి తొలగింపు
ఆర్టీసీలో మొత్తం 2వేల మందిని అన్యాయంగా రిమూవల్ చేసినట్టు కార్మికులు చెప్తున్నారు. తప్పులు జరిగితే ఆర్టీసీలో శిక్షించడానికి మెమో, చార్జీషీటు జారీ చేయడం, వార్నింగ్, కౌన్సెలింగ్, అభిశంసన, ప్రివిలేజ్ బస్ పాస్ నిలుపుదల, ఇంక్రిమెంట్ నిలుపుదల, జరిమానా విధించడం, డిపో ట్రాన్స్ఫర్లు, సస్పెన్షన్, సర్వీసు తగ్గించడం వంటి శిక్షలు ఉన్నాయి. కానీ ఆర్టీసీలోని సదరు ఉన్నతాధికారి అవేమీ పట్టించుకోకుండా, లీగల్ నాలెడ్జ్ లేనివారితో విచారణ చేయించి, నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారని వాపోతున్నారు. ఇలా అడ్డగోలుగా కార్మికులను విధుల నుంచి తొలగించడమేంటని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒకే రకమైన పొరపాట్లకు ఒకేరకమైన శిక్షలు విధించకుండా అధికారులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉద్యోగిపై ఆరోపణ వస్తే.. ‘ప్రూవ్డ్’ అని రాసి సస్పెండ్ చేయడం దారుణమని అంటున్నారు. ఇలా కార్మికుల జీవించే హకును అన్యాయంగా కాలరాస్తున్నారని చెప్తున్నారు.
రోడ్డునపడ్డ కార్మికుల బతుకులు
సంస్థ లాభాల్లోకి రావడం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న తమను అన్యాయంగా విధుల నుంచి తొలగించడం వల్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని కార్మికులు విలపిస్తున్నారు. ఆదాయం లేక కొందరు కార్మికులు బతుకుదెరువుకోసం కూలీలుగా మారుతున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇంకొందరు కుటుంబాలను పోషించుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని చెప్తున్నారు. ఇటీవల బాన్సువాడ డిపోకు చెందిన విక్టర్ అనే కండక్టర్ ఆబ్సెంట్ అయినందుకు విధుల నుంచి ఆక్రమంగా రిమూవల్ చేశారు. దీంతో బతుకుభారమై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.