మెదక్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): చిత్రంలో చేతుల్లో పైసలు చూసుకొని మురిసిపోతున్న గిరిజన రైతు దంపతులు రూపావత్ బదరియా. వీరిది మెదక్ మండలం బాలానగర్ తండా. తండ్రి నుంచి వచ్చిన రెండు ఎకరాలను సాగు చేసుకొంటూ వస్తున్నారు. గతంలో ఎవుసానికి ఊళ్లె సేటు దగ్గర మిత్తీలకు తెచ్చి వ్యవసాయం చేసెటోళ్లు. పంట పండినంక వచ్చిన వడ్లను అమ్మి అప్పు తీర్చేటోళ్లు. వచ్చిన పైసలు, అసలు, మిత్తీలకే సరిపోయేది. చేతిలో పైసలు మిగిలేవి కావు. మళ్లీ సాగు చేయాలంటే చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండేది కాదు. రైతుబంధు వచ్చినంక సమయానికి పైసలు వస్తుండటంతో మిత్తీలు తేకుండా విత్తనాలు, ఎరువులు తెచ్చుకొంటుండు. ట్రాక్టర్ కిరాయిలు, కూలీల ఖర్చులు కూడా ఎల్లుతున్నయి. వానకాలంలో పంట పండిస్తే పెట్టుబడి పోను రూ.70 వేలు మిగిలినయి. బాయిలకాడ 24 గంటల కరెంటు వస్తున్నది. యాసంగిలో పంట పెట్టుబడి సాయం రూ.10 వేలు అందడంతో ఉత్సాహంగా ఎవుసం పనుల్లో నిమగ్నమైండ్రు. గతంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రిపేర్ చేసేందుకు చానా రోజులు పట్టేది.. ఇప్పుడు నిమిషం కూడా కరెంటు పోతలేదని అన్నారు గిరిజన దంపతులు. సీఎం కేసీఆర్ సార్ వచ్చిన తర్వాత మాకు పింఛన్లు వస్తున్నాయని, ఆయన చల్లగా ఉండాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నట్టు వారు చెప్పారు.
రైతుబంధు కోసం 5,762 మైక్రో ఏటీఎంలు
రాష్ట్ర ప్రభుత్వం 2022 యాసంగి సీజన్ కోసం విడుదల చేసిన రైతు బంధు డబ్బును రైతులు తీసుకొనేందుకు వీలుగా 5,762 మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 70.54 లక్షల మంది రైతులకు రూ.7,676 కోట్ల సాయాన్ని ఈ నెల 28 నుంచి విడుతల వారీగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నది. దీంతో రైతులు డబ్బు విత్ డ్రా చేసుకొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా 5,762 పోస్టాఫీసుల్లో మైక్రో ఏటీఎంలను ఏర్పాటు చేసినట్టు పోస్టల్ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. నగదు పంపిణీ కోసం 5,386 మంది పోస్టుమాస్టర్లను సైతం అందుబాటులో ఉంచినట్టు వెల్లడించింది. రైతులు మైక్రో ఏటీఎం వద్దకు వెళ్లి బయోమెట్రిక్(ఫింగర్ ప్రింట్) వేయగానే రిజిస్టర్ అయిన ఫోన్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని పోస్టుమాస్టర్‌కు చెప్పి నగదును తీసుకోవచ్చు. నగదు ఉపసంహరణకు ఎటువంటి చార్జీలు వసూలు చేయరని, ఉచితంగా ఈ సదుపాయాన్ని పొందవచ్చని పోస్టల్ అధికారులు పేర్కొన్నారు.
20 వేలు పడ్డయి.. తెచ్చుకున్న
ఎవుసం మొదలుకాగానే రైతుబంధు పైసలు ఇస్తుండ్రు. సర్దాపూర్‌లో నాలుగు ఎకరాల పట్టా భూమి ఉన్నది. రైతుబంధు పైసలు రూ.20 వేలు బ్యాంకు ఖాతాలో పడ్డట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. వెంటనే బ్యాంకుకు పోయి తెచ్చుకున్ను. పొలం దున్నేందుకు ట్రాక్టర్ కిరాయి రూ.7 వేలు పోను మిగిలిన రూ.13 వేలతో మందు బస్తాలు కొనుక్కొని వస్తున్న. ఉద్దెర ఇయ్యమని ఎరువుల దుకాణపాయినను బతిలాడేటోళ్లం. వడ్లమ్మినంక బాకీ కట్టేది. రైతుబంధు పైసలతో ఇప్పుడు ఎక్కడ అగ్గువ ఉంటే అక్కడ నగదు పైసలిచ్చి కొంటున్నం. రైతుబిడ్డ సీఎం అయితే రాజ్యం బాగుంటదని కేసీఆర్ సారు చేసి చూపిస్తుండు. ఎప్పటికీ ఆయనే సీఎంగా ఉండాలి. వ్యవసాయం ఇంకా పెరుగుతది. ఇద్దరు బిడ్డలు, కొడుకును బాగా సదివించిన. సర్కారు నౌకరి దొరికింది. ఇద్దరు బిడ్డల పెండ్లిళ్లు చేసిన.
-కంచర్ల దేవయ్య, సర్దాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లా
కరెంట్ కష్టాలు తీర్చిండు
గతంలో వ్యవసాయం చేయాలంటే భయపడేటోళ్లం. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న మేలును చూసి వ్యవసాయంపై ఆసక్తి పెరిగింది. నాకు 3 ఎకరాల పొలం ఉన్నది. వరి పంట సాగు చేసిన. యాసంగి పెట్టుబడి సాయం రూ.15 వేలు బ్యాంకు ఖాతాలో జమైంది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సాగునీరు, ఉచిత విద్యుత్తు అందిస్తుండటంతోపాటు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారు. కరెంటు కష్టాలు తీర్చి, పెట్టుబడి కోసం రైతుబంధు సాయం చేసి, పండిన పంటకు మద్దతు ధర ఇస్తున్న సీఎం సార్‌కు కృతజ్ఞతలు.
– రంగస్వామి, జమ్మిచేడు, జోగులాంబ గద్వాల జిల్లా
అప్పు బాధ తప్పింది
నాకు పెద్దపల్లి మండలం భోజన్నపేటలో 3 ఎకరాల భూమి ఉన్నది. రైతుబంధు ఇవ్వక ముందు ఏటా యాసంగి, వానకాలం పంటకు ఊళ్లె ఓ ఆసామి దగ్గర రూ.2 చొప్పున వడ్డీకి 30-40 వేలు అప్పుగా తెచ్చుకునేది. ఇప్పుడు అప్పుచేసే బాధ తప్పింది. మిత్తి కట్టే బాధ అంతకన్నా పోయింది. ఖాతాలో 15 వేలు పెట్టుబడి సాయంగా జమకావడంతో వెంటనే బ్యాంకుకు పోయి తెచ్చుకొన్న. విత్తనాలు తెచ్చిన. ఇంకా పైసలతో ట్రాక్టర్ కిరాయిలు, యూరియా బస్తాలు తెచ్చుకుంటా. సర్కారుపై భరోసాతో అప్పు ఎక్కడా తీసుకరాలేదు. ఇప్పుడు ఎవరి కాడ చేయి చాపాల్సిన అవసరం లేకుండా పోయింది. ఏ ఆసామి దగ్గరికి వెళ్లి అప్పు అడగాల్సిన పనిలేదు. దర్జాగా ఎవుసం పనులు చేసుకుంటా.
-నెత్తెట్ల కొమురయ్య, భోజన్నపేట, పెద్దపల్లి జిల్లా
రైతుబంధు సాయం పడ్డది
నాకు 2 ఎకరాల 21 గుంటలు ఉన్నది. రైతుబంధు సాయం రూ.12,625 ఖాతాలో పడ్డయి. బ్యాంకుకు పోయి పైసలు తెచ్చుకున్న. పైసలు చేతుల ఉండటంతో పెట్టుబడికి ఆర్థిక ఇబ్బందులు తీరాయి. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కేసీఆర్ సార్ రైతుబంధు పథకం కింద సాయం చేస్తుండు. విత్తనాలు, పురుగు మందులు, కూలీ ఖర్చుల రంది పోయింది. నాలాంటి రైతులకు ఎంతో చేదోడు, వాదోడుగా సాయం నిలిచింది. కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం. సాయం పడడంతో సంతోషంగా ఉన్నది.
-పెనిశెట్టి కురుమూర్తి,లింగసానిపల్లి, నాగర్‌కర్నూల్ జిల్లా
వచ్చిన పైసలు మిత్తీలకే పోయేయి
కేసీఆర్ సారు రైతుల్ని మంచిగ ఆదుకుంటుండు. ఇంతకుముందు చేనుకు పురుగు పడితే మందుల కోసం షావుకారుల దగ్గరికి వెళితే ఉద్దెర ఇయ్యకపోయేది. పైసలిత్తెనే ఇచ్చేది. మూడు సొప్పున మిత్తికి పైసలు తెచ్చి పురుగు మందులు కొని తెచ్చి కొట్టేటోళ్లం. కేసీఆర్ సార్ దయ వల్ల అప్పుడు పడ్డ బాధలన్నీ ఇప్పుడు పోయినయి. నాకు ఓకాడ ఉన్న ఎకరంలో వడ్లు పండిత్తాన. ఇంకోకాడ కొద్దిగ చెలుక ఉంది. ఎకరం ఉన్న కాడ బోరుబాయి లేదు. పక్కనున్న రైతును నీళ్లడిగితె..కరంటు సరిగా వత్తలేదని, నాకే సరిపోవని, 20 గుంటల్లనే పండించుకోడానికే నీళ్లు ఇచ్చేది. చేసేదేమి లేక మిగతా భూమిని పడావు పెట్టిన. గిప్పుడు కేసీఆర్ సారు దయ వల్ల కరంటు వత్తాంది. ఎప్పటికి ఉంటాంది. రైతుబంధు పైసలు పడ్డయి. ఉన్న ఎకరంల మొత్తం వడ్లు పండిత్తాన.
-అజ్మీరా కిషన్‌నాయక్, అడవి కమలాపురం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మందుకట్టలకు అక్కరకొచ్చినయి
ఐదేండ్ల నుంచి చూస్తున్న. రైతుబంధు వచ్చినకాంచి మందుకట్టలు కొందామనుకునే సరికి పైసలు పడుతున్నాయి. నాకు 30 గుంటల భూమి ఉన్నది. వరినే సాగు చేస్త. ఒక డీఏపీ, రెండు యూరియ కట్టలు అయితే చాలు పొలం చేతికి వస్తుంది. వానకాలం, ఎండాకాలం కూడా పంట పండిస్తున్నా. ఏటా అవిటి మొదట్లోనే రైతుబంధు ద్వారా రూ.3,750 వస్తున్నాయి. వచ్చిన డబ్బులు వచ్చినట్టే మందుకట్టలు కొంటున్నా. సర్కార్ ఏదో కొంత సాయం చేస్తది అనుకున్నా. కానీ డైరెక్టుగా పెట్టుబడి కోసం పైసలు పంపుతది అనుకోలేదు. నేనొక్కడినే కాదు మా ఊర్లో అందరూ సీజన్ వచ్చిందంటే చాలు సీఎం కేసీఆర్ డబ్బులు వేస్తడు అనే నమ్మకంతో ఉంటున్నారు. రైతు ఎంత బాధపడుతున్నాడో అని తెలిసి ఇంత సాయం చేస్తున్న కేసీఆర్ సార్ పది కాలాలపాటు చల్లగా ఉండాలి.
-పాశం వీరస్వామి, తల్లంపాడు, ఖమ్మం రూరల్
రైతుబాంధవుడు కేసీఆర్
ఒకప్పుడు లాగోడి కోసం అప్పులు చేసి పంటలు సాగు చేసేటోళ్లం. వేసిన పంటలు వర్షాలు లేకపోవడంతో దిగుబడి సరిగ్గా రాక రైతులు అప్పుల పాలయ్యేవారు. నేడు రైతు బిడ్డగా సీఎం కేసీఆర్ అన్నదాతల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసి చూపిస్తుండు. నాకు 3 ఎకరాల పొలం ఉన్నది. రైతుబంధు పథకం ద్వారా రెండు పంటలకు కలిపి యాడాదికి రూ.30 వేలు వస్తున్నాయి. ప్రస్తుతం యాసంగికి ఈ రోజే రూ.15 వేలు బ్యాంకు ఖాతాలో జమ అయినయి. వరినాట్లు వేసేందుకు కరిగేటు సిద్ధం చేస్తున్నా. అదునుకు పెట్టుబడి సాయం అందడంతో తిప్పలు లేకుండా పంట సాగు చేస్తున్నా. లాగోడి కోసం ఎవరి దగ్గర చేయి చాపాల్సి రావడం లేదు. ఇలాంటి సీఎంకు తెలంగాణ రైతులంతా రుణపడి ఉంటారు.
-పి.కృష్ణ, కుమ్మరిగూడ, షాబాద్ మండలం, రంగారెడ్డిజిల్లా
గతంలో ఏ సర్కారు పట్టించుకోలే..
ఆరుగాలం కష్టపడేటోళ్లం. పంట పండించి అమ్మిన దాంట్లో వచ్చినదాంతో అప్పులు తీర్చి ఉన్న కొద్దిపాటితో సర్దుకునేటోళ్లం. గతంలో ఏ సర్కారు మమ్ముల్ని పట్టించుకోలేదు. మా బతుకులు బాగుపడుతై, సంతోషాలు వస్తయని అనుకోలేదు. కేసీఆర్ సార్ వచ్చినంక రైతులంతా సంతోషంగా ఉంటున్నాం. రైతుబంధు డబ్బులు ఎకరానికి ఐదు వేల చొప్పున ఇస్తుండటంతో పెట్టుబడి కష్టాలు తీరుతున్నాయి. గతంలో కరెంటు కష్టాలు, ఎరువులు, విత్తనాల తిప్పలు, నీళ్ల కరువు తలుచుకుంటుంటే అదో పీడకల అనిపిస్తుంది. ఇయ్యాల కేసీఆర్ సార్ వల్ల రెండున్నర ఎకరాల భూమికి ఏడాదికి రెండుసార్లు పన్నెండున్నర వేలు వస్తుంటే అప్పులు చెయ్యకుండా సంతోషంగా సాగు చేస్తున్నా.
-బానోతు నర్సింహ, చివ్వెంల, సూర్యాపేట జిల్లా
బ్యాంకుకు పోయి పైసలు తెచ్చుకున్నం
మా ఊళ్లె నాలుగెకరాలు, కమ్మర్‌పల్లిలో 2 ఎకరాలు సాగు చేసుకుంటున్నం. ఇంతకుమునుపు పెట్టుబడి కోసం సావుకార్ల చుట్టూ తిరిగేటోళ్లం. వడ్డీలకు తెచ్చి పంటలు వేసేటోళ్లం. పంట చేతికిరాంగనే వడ్డీ, అసలు తిరిగి కట్టేటోళ్లం. రాత్రనక, పగలనక పనిచేత్తే ఏం మిగిలేటివి కావు. మళ్లా పంట వేయాల్నంటే అప్పు అయ్యేటిది. ఇట్లా ఎవుసం చేసుడు మస్తు కష్టయమ్యేది. తెలంగాణ వచ్చి కేసీఆర్ సీఎం అయినంక మాలాంటి రైతుల బాధలన్నీ పోయినయ్. మొదట పెట్టుబడి కోసం ఎకరానికి రూ.4 వేలు వేసిన్రు. ఇప్పుడు రూ.5 వేలు ఇస్తుండు. మొత్తం ఆరెకరాలకు రూ.30 వేలు పడ్డట్టు సెల్‌ఫోన్‌కు మెసేజ్ వచ్చింది. ఇగో ఇయ్యాల బ్యాంకుకు ఇద్దరం పోయి డబ్బులు తీసుకొచ్చినం. గివ్విటితో ఎరువులు, విత్తనాలు తెచ్చుకుంటం. దున్నడానికి కూడా అక్కరకు వస్తయ్. గిసొంటి సీఎం ఉన్నంత కాలం మాకు రంది ఉండదు.
-వెంకట్‌రెడ్డి-లలిత, లగ్గాం, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా