హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఆయా శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 57 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్లోని సచివాలయంలో నిర్వహించిన ఆఫీసర్స్ కమిటీ మొదటి సమావేశంలో టీజీఈజేఏసీ ప్రతినిధి బృందంతో కలిసి వారు చర్చల్లో పాల్గొన్నారు. ఈ భేటీకి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ అధ్యక్షత వహించారు. ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు ఆఫీసర్ల కమిటీకి సమస్యలు వివరించారు. మంత్రులతో డిమాండ్ల గురించి చర్చిస్తామని నవీన్ మిట్టల్ హామీ ఇచ్చారు. సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి లోకేశ్ కుమార్, డిప్యూటీ సీఎం ప్రత్యేక కార్యదర్శి కృష్ణభాస్కర్, టీఎస్సీపీఎస్ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, సీపీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేశ్ గౌడ్, టీజీవోల రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ బీ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ) : తమను ఒకే క్యాటగిరీగా పరిగణించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధిహామీ సిబ్బంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్కను కలిశారు. తమ పెండింగ్ వేతనాలు విడుదల చేయించినందుకు ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అనుసరిస్తున్నట్టుగా తెలంగాణలోనూ అందరినీ ఒకే క్యాటగిరీగా పరిగణించాలని మంత్రికి విన్నవించా రు. సీతక్క సానుకూలంగా స్పం దించినట్టు ఫీల్డ్ అసిస్టెంట్ల నాయకులు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రతినిధులతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని సీతక హామీ ఇచ్చినట్టు వారు పేర్కొన్నారు. మంత్రిని కలిసినవారిలో ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బొలుగూరి రవి, నాయకులు ఉన్నారు.