న్యూఢిల్లీ, సెప్టెంబర్ 11: తమ ఉద్యోగాలను విదేశీయులు లాక్కుంటున్నారని అమెరికాలో హెచ్-1బీ వీసాలపై ఆంక్షల కోసం డిమాండ్లు పెరిగిపోతున్న వేళ గడచిన ఎనిమిది సంవత్సరాలలో హెచ్-1బీ వీసాలపై ఆధారపడడాన్ని భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) సర్వీసెస్ కంపెనీలు గణనీయంగా తగ్గించివేయగా ఆ వీసాలను అత్యధికంగా అమెరికన్ కంపెనీలే ఉపయోగించుకుంటున్నాయి. భారత్లోని ఏడు ప్రముఖ ఐటీ కంపెనీల నుంచి ప్రాథమిక ఉద్యోగం కోసం హెచ్-1బీ దరఖాస్తులు గడచిన ఎనిమిదేళ్లలో దాదాపు 56 శాతం తగ్గాయి.
2015లో దాదాపు 15,100 దరఖాస్తులు చేసుకోగా 2022-23లో కేవలం 6,700 దరఖాస్తులు మాత్రమే ఈ కంపెనీలు చేసినట్లు నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ(ఎన్ఎఫ్ఏపీ) గణాంకాలు తెలిపాయి. ఒకప్పుడు హెచ్-1బీ స్పాన్సర్ చేయడంలో అగ్రగామిగా ఉన్న ఓ ప్రముఖ భారతీయ ఐటీ సర్వీసెస్ కంపెనీ ఇదే కాలంలో 75 శాతం అప్రూవల్స్ని తగ్గించివేసింది. మరో పక్క అమెరికాకు చెందిన ఐదు ప్రముఖ ఐటీ కంపెనీలు 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 28,000 హెచ్-1బీ వీసా ఆమోదాలు సంపాదించుకున్నాయి.