న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో పెరుగుతున్న విమాన ప్రమాదాలు ప్రయాణికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటన తర్వాత విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గినట్టు పలు సర్వేల్లో తేలింది. ఈ నేపథ్యంలో విమాన ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించడానికి శాస్త్రవేత్తలు సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. ప్రమాదం జరిగినప్పుడు కార్లలో ఎయిర్‌బ్యాగులు తెరుచుకున్నట్టుగానే, విమానాలకు కూడా ఎయిర్‌బ్యాగ్‌లతో రక్షణ కల్పించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇంజినీర్లు ఎషెల్ వాసిమ్, దర్శన్ శ్రీనివాసన్ అభివృద్ధి చేశారు. వీరు బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, పిలానీకి చెందిన దుబాయ్ క్యాంపస్‌కు చెందినవారు. ‘ప్రాజెక్ట్ రీబర్త్’ పేరుతో వీరు దీనిని రూపొందించారు. ప్రతిష్ఠాత్మక జేమ్స్ డైసన్ అవార్డ్ కోసం పోటీలో ఫైనల్స్‌కు చేరినవాటిలో ఈ ప్రాజెక్టు కూడా ఉంది. జేమ్స్ డైసన్ అవార్డ్ వెబ్సైట్లో ఈ ‘ప్రాజెక్ట్ రీబర్త్’ మొదటి ఏఐ పవర్డ్ క్రాష్ సర్వైవల్ సిస్టమ్ అని పేర్కొన్నారు. జూన్ 12న అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోవడంతో గుండె పగిలిందని, ఆ క్షణాలు తమకు ప్రేరణగా నిలిచి, దీనిని అభివృద్ధి చేశామని ఇంజినీర్లు తెలిపారు.
‘ప్రాజెక్ట్ రీబర్త్’లోని ఏఐ సిస్టమ్ విమానం ఎగురుతున్న ఎత్తు, వేగం, ఇంజిన్ పరిస్థితి, దిశ, అగ్నిప్రమాదం, పైలట్ స్పందన వంటివాటిని పర్యవేక్షిస్తుంది. రాబోతున్న అత్యవసర పరిస్థితి గుర్తించి సమాచారం తెలుసుకుని సత్వర నిర్ణయం తీసుకోగలుగుతుంది. విమానం 3,000 అడుగుల కన్నా తక్కువ ఎత్తులో ఉండి, కూలిపోవడం అనివార్యమైనపుడు, ఈ వ్యవస్థ తనంతట తానే పని ప్రారంభిస్తుంది. ఈ దశలో కూడా పైలట్ తన ఆదేశాలను అమలు చేయవచ్చు. హైస్పీడ్ ఎయిర్‌బ్యాగ్స్ హుటాహుటిన విమానం ముందు భాగం, మధ్య భాగం, తోక భాగాల్లో రెండు సెకండ్లలోపలే తెరుచుకుంటాయి. విమానం నేలను తాకేటపుడు ఈ బ్యాగులు విమానాన్ని పట్టుపురుగు గూడు మాదిరిగా చుట్టుకుని రక్షణ కవచంగా మారుతాయి. ఆ విమానం భవనాలపై పడితే, భవనాలకు నష్టం జరుగుతుందా? లేదా? స్పష్టత లేదు.
అత్యవసర పరిస్థితిలో కూడా ఇంజిన్లు పని చేస్తూ ఉంటే, ఆ విమానం నెమ్మదిగా దిగేవిధంగా రివర్స్ థ్రస్ట్ ప్రారంభమవుతుంది. అలా కాకపోతే, విమానం వేగాన్ని తగ్గించడానికి, విమానాన్ని నిలకడగా ఉంచడానికి గ్యాస్ థ్రస్టర్స్ యాక్టివేట్ అవుతాయి. విమానం నేలను తాకినపుడు ఆ బలాన్ని శోషించుకునే ద్రవాలు సీట్ల వెనుక ఉంటాయి, ఇవి మృదువుగా ఉంటాయి. విమానం నేలను తాకినపుడు ఈ ద్రవాలు గట్టిపడి ప్రయాణికులు, సిబ్బంది తీవ్రంగా గాయపడకుండా కాపాడతాయి. ఈ ప్రాజెక్టును ప్రస్తుత విమానాలతోపాటు, కొత్తగా తయారు చేసే విమానాల్లో కూడా అమర్చవచ్చు. మరిన్ని పరీక్షల కోసం ఏరోస్పేస్ ల్యాబ్స్‌తో భాగస్వాములమవుతామని ఈ ఇంజినీర్లు చెప్పారు. చాలా విమాన భద్రత వ్యవస్థలు విమానం కూలిపోవడాన్ని నిరోధిస్తాయి కానీ, ఒకవేళ ప్రమాదం జరిగితే, ప్రయాణికులు సజీవంగా బయటపడటం సాధ్యం కాదన్నారు. తాము రూపొందించిన ‘ప్రాజెక్ట్ రీబర్త్’ మాత్రం మిగిలినవన్నీ విఫలమైనపుడు అత్యంత దారుణ పరిస్థితికి సిద్ధంగా ఉంటుందని, ప్రయాణికులు సజీవంగా ఉండటానికి అవకాశం ఇస్తుందని
తెలిపారు.