మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం గ్రూప్-1 అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలి. జుడీషియల్ విచారణ జరపించాలి. హైకోర్టు ఆదేశించినట్టుగా గ్రూప్-1 పరీక్షను మళ్లీ తాజాగా, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించాలి.
– కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అంగట్లో సరుకులుగా గ్రూప్-1 పోస్టులను అమ్ముకొని నిరుద్యోగుల గొంతు కోసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఏండ్ల తరబడి కష్టపడి, తమ విలువైన సమయాన్ని, తల్లిదండ్రుల కష్టార్జితాన్ని వెచ్చించి పోటీ పరీక్షలు రాసే నిరుద్యోగుల గొంతును కాంగ్రెస్ ప్రభుత్వం కోసింద ని తూర్పారబట్టారు. తెలంగాణ యువత నమ్మకాన్ని రేవంత్ సర్కారు వమ్ము చేసిందని మండిపడ్డారు. గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో ఫెయిలైన ఈ ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించబోదని అన్నారు. గ్రూప్-1 పోస్టుల కోసం భారీగా డబ్బులను డిమాండ్ చేసినట్టు పలువురు విద్యార్థులు మీడియాలో చేస్తున్న ఆరోపణలపై కేటీఆర్ గురువారం ఒక ప్రకటనలో స్పందించారు. డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలపై ప్ర భుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. మం త్రులు, ముఖ్యమంత్రి కార్యాలయం గ్రూప్-1 అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణల నేపథ్యంలో జ్యుడీషియల్ విచారణ జరుగాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. హైకోర్టు ఆదేశించినట్టుగా గ్రూ ప్-1 పరీక్షను మళ్లీ, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. విచారణ ద్వారా నిరుద్యోగులకు న్యాయం చేకూర్చడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా నిరోధించినట్టు అవుతుందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, కాసుల కకుర్తి గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో అనేక అవకతవకలకు కారణమయ్యాయని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని, కానీ కాంగ్రె స్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని ఒక వ్యాపారంగా మార్చిందని ఆరోపించారు. అందుకే పోస్టులను అమ్ముకున్నదని పలువురు విద్యార్థులు చేస్తున్న ఆరోపణలను కేటీఆర్ ప్రస్తావించారు. పరీక్షల ని ర్వహణలో ఈ ప్రభుత్వం ఫెయిలై యువత న మ్మకాన్ని పూర్తిగా కోల్పోయిందని, ఈ వైఫల్యా న్ని యువత ఎప్పటికీ క్షమించరని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏడాదిలోపే రెం డు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ చేసిన మోసపూరిత వాగ్ధానంపై ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటుచేసి చర్చించాలని డిమాండ్ చేశారు. మాటలతో కాకుండా చేతల్లో చూపించి యువత ఆశలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.