చిక్కడపల్లి/ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 11: గతంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను హైకోర్టు తీర్పు మేరకు రద్దు చేయాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద గురువారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరుద్యోగులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నేతలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం గెల్లు శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ గ్రూప్-1లో అవకతవకలకు రేవంత్ సర్కారే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.
బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు మాట్లాడుతూ గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాలని, నైతిక బాధ్యత వహిస్తూ చైర్మన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అరస్టైన వారిలో బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తోట్లస్వామియాదవ్, తుంగ బాలు, బోయినపల్లి నాగరాజు, రహమత్, నితీశ్, ప్రశాంత్, విశాల్, రాహుల్, అద్విత్, మనీషా, అఫ్రిది, దయాకర్ పా ల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ ఎదుట బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామి ఆధ్వర్యంలో ఫ్ల్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అంబర్పేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. చైర్మన్ రాజీనామా చేయాలని నేతలు డిమాండ్ చేశారు.
గ్రూప్-1ను రద్దు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్వీ నేతలు నిరసనకు దిగారు. కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ మెయిన్ గేటు వద్ద, సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గాంధీచౌరస్తాలో ప్రభుత్వం, టీజీపీఎస్సీ దిష్టిబొమ్మలు దహ నం చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్క ర్ చౌరస్తాలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు హేమంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో దహనం చేసి నిరసన వ్యక్తంచేశారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ యూనివర్సిటీ ఎదుట బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కేయూ మొదటి గేటు వద్ద బైఠాయించి ప్రభుత్వానికి, టీజీపీఎస్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం టీజీపీఎస్సీ దిష్టిబొమ్మ దహనం చేశారు. కేయూ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు బైరపాక ప్రశాంత్, ఇన్చార్జి జెట్టి రాజేందర్, శరత్చంద్ర పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో బీఆర్ఎస్వీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.