హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పోస్టులను ప్రభుత్వ పెద్దలు అమ్మేందుకు యత్నించారా? పోస్టుకో రేటు చొప్పున బేరం పెట్టారా? అస్మదీయుల కోసం అంతకు తెగించారా? అంటే అవుననే ఆరోపిస్తున్నారు నిరుద్యోగులు. నిరుద్యోగ జేఏసీ నేత కే శ్రీనివాస్ తాజాగా సంచలన ఆరోపణ చేశారు. గ్రూప్-1 పోస్టులను రూ.3 కోట్లకు బేరం పెట్టారని, ఓ మంత్రి అత్యంత కీలకమైన డిప్యూటీ కలెక్టర్ పోస్టును మూడు కోట్లకు బేరం మాట్లాడారని శ్రీనివాస్ చెప్పారు.
ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. వీడియోలో శ్రీనివాస్ చెప్పిన వివరాల ప్రకారం ‘ఓ అభ్యర్థి.. మధ్యవర్తి ద్వారా గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం కోసం మంత్రి గారిని సంప్రదించారు. ఎంతివ్వగలవు? అని మంత్రి గారు అడగగా, తానైతే రూ. 50లక్షలు ఇవ్వగలననని అభ్యర్థి చెప్పారు. ఏం మాట్లాడుతున్నావ్.. మేం ఒక ట్రాన్స్ఫర్కే రూ 20-30 లక్షలు తీసుకుంటున్నాం. రెండు మూడు కోట్లు లేనిదే గ్రూప్-1 ఉద్యోగం వస్తదనుకున్నవా?’ అంటూ సదరు మంత్రి చెప్పినట్టు శ్రీనివాస్ ఓ మీడియా చానల్‌తో మాట్లాడుతూ చెప్పారు. శ్రీనివాస్ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. గ్రూప్-1లో ఫలితాలను హైకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో ఈ ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. గ్రూప్-1లో అక్రమాలు, ప్రభుత్వ పెద్దల హస్తంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
గ్రూప్-1 పోస్టుల విషయంలో ఇద్దరు ఎమ్మెల్సీలు తరుచూ టీజీపీఎస్సీ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నట్టు నిరుద్యోగ జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు. సామాన్యులెవరికి ఎంట్రీ లేని టీజీపీఎస్సీ కార్యాలయానికి ఓ ఎమ్మెల్సీ చాలాసార్లు వెళ్లివచ్చినట్టు చెప్తున్నారు. గ్రూప్ -1 అక్రమాల్లో సదరు ఎమ్మెల్సీల పాత్ర కూడా ఉండొచ్చని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. టీజీపీఎస్సీ సీసీ కెమెరాలను పరిశీలిస్తే వీరి సంగతి బయటపడుతుందని చెప్తున్నారు. కాంగ్రెస్ నాయకుల బంధువులైన మరో ఇద్దరు అభ్యర్థులు కూడా టాప్ ర్యాంకర్లలో చోటు దక్కించుకున్నారని జేఏసీ నేతలు చెప్తున్నారు.
అమెరికా నుంచి వచ్చి కోచింగ్ తీసుకోకుండా ఒకరు, ఖమ్మం జిల్లాకు చెందిన మరొకరు, కొడంగల్‌కు చెందిన మరో అభ్యర్థి.. కాంగ్రెస్‌లోని కీలక పదవుల్లోని నాయకులకు బంధువులేనని జేఏసీ నేతలు వివరిస్తున్నారు. కొత్త నోటిఫికేషన్ ద్వారా తమకు కావాల్సిన వాళ్లతో దరఖాస్తు చేయించారని, అందులో ఏపీ వాళ్లు కూ డా ఉండటం, వారిలో కొందరికి కీలక ర్యాంకులు రావడం అనుమానాస్పదంగా ఉందని చెప్తున్నారు. రెండు సెంటర్ల నుంచే 74 మంది ర్యాంకర్లు ఉండటాన్ని బట్టి చూస్తుంటే కావాలనే కొందరిని ఒకే సెంటర్లో పరీక్ష రాయించారనే విషయం అర్థమవుతున్నదని అంటున్నారు. ప్రభుత్వ పెద్దలు, మంత్రి పాత్రపై జ్యుడీషియల్ కమిషన్, సీబీసీఐడీతో విచారణ జరిపించాలని నిరుద్యోగ జేఏసీ నేతలు డిమాం డ్ చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యలపై మాట్లాడిన మహిళా అభ్యర్థి అస్మాపై అక్రమ కేసులు తక్షణమే కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు.