హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తేతెలంగాణ): తెలంగాణలో కేసీఆర్ పాలనలో విద్యావ్యవస్థ నాశనమైంది.. ఇది తరుచూ కాంగ్రెస్ నేతలు వల్లించే మాటలు. కానీ శుద్ధ అబద్ధం. ఇదే విషయాన్ని కేంద్రం గతంలోనే పార్లమెం ట్ వేదికగా అనేకసార్లు ప్రకటించింది. ఆయా వివరాలను పార్లమెంట్ ముందుంచింది. ఈ వివరాలను పరిశీలిస్తే… తెలంగాణలో కొత్తగా సర్కారు స్కూళ్లు తెరిస్తే.. కాంగ్రెస్ ఏలుబడిలో స్కూళ్లు మూతబడ్డట్టు స్పష్టమైంది.
2014-15లో తెలంగాణలో 29,268 స్కూళ్లు ఉండగా, 2015-16లో వీటి సంఖ్య 29,127కు చేరింది. ఇక 2018-19కి వచ్చేసరికి సర్కారు స్కూళ్ల సంఖ్య 29,822కు పెరిగింది. అంటే ఐదేండ్లల్లో 554 సర్కారు స్కూళ్లు పెరగాయి. అదే కాంగ్రెస్ పాలనలోని కర్ణాటకలో 2014-15లో 50,493 సర్కారు స్కూళ్లు ఉండగా, 2015-16లో 50,424కు పడిపోయింది. అంటే ఒక్క ఏడాదిలో 69 స్కూళ్లు మూతపడ్డాయి. ఇక 2018-19లో ఈ స్కూళ్ల సంఖ్య 50,184కు తగ్గింది. ఈ ఐదేండ్ల కాలంలో 309 స్కూళ్లు మూతపడ్డాయి. విద్యావ్యవస్థను ఎవరు నాశనం చేశారో తెలుసుకునేందుకు ఈ వివరాలు చాలంటూ పలువురు నెటిజన్ల పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.