హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా 6,848 మంది సైబర్ క్రైమ్ బాధితులకు రూ.53 కోట్లను వారి ఖాతాల్లోకి జమ చేసినట్టు రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖాగోయెల్ తెలిపారు. పోలీసు కమిషనర్లు, ఎస్పీల సమన్వయంతో 14న మెగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి సైబర్ క్రైమ్ నేరాలకు గురైన బాధితులకు ఊరట కలిగించేలా, వారి అకౌంట్లలో స్తంభింపజేసిన నగదును తిరిగి వారి ఖాతాల్లోకి జమ చేసినట్టు తెలిపా రు. ఆదివారం జాతీయ లోక్ అదాలత్ ద్వారా రూ.15.79 కోట్లను సైబర్ సెక్యూరిటీ బ్యూరో రీఫండ్ సాధించగలినట్టు వివరించా రు. మార్చి 8న నిర్వహించిన మొదటి మెగా లోక్ అదాలత్‌లో ఒక రోజులో 3,527 మంది బాధితులకు రూ.14.3 కోట్లు తిరిగి చెల్లించినట్టు పేర్కొన్నారు.
అదే నెలలో మరో విడతలో 4,984 మందికి రూ.43.68 కోట్లు వారి ఖాతాల్లో జమచేసినట్టు తెలిపారు. ఈ ఏడాది రూ.97.18 కోట్లను 11,832 మంది కి తిరిగి చెల్లించినట్టు శిఖాగోయెల్ వెల్లడించారు. అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో 782 కేసులకు 14.54 కోట్లు, సైబరాబాద్ పరిధిలో 2,997 కేసులకు 13.81 కోట్లు, రాచకొండ పరిధిలో 1,005 కేసులకు రూ. 11.01 కోట్లు, టీజీసీఎస్బీ ప్రధాన కార్యాల యం నుంచి 172 కేసులకు రూ.5.74 కోట్లు, సంగారెడ్డి పరిధిలో 163 కేసులకు రూ.1.62 కోట్లు, వరంగల్ పరిధిలో 250 కేసులకు రూ.89 లక్షలు రీఫండ్ చేసినట్టు పేర్కొన్నా రు. 2024 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 30,478 కేసుల్లో రూ. 281.1 కోట్ల రీఫండ్‌ను జమ చేసినట్టు వివరించారు.