హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణలో ప్రభుత్వం, పోలీసుయంత్రాంగం పూర్తిగా విఫలమయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. హత్యలు యథేచ్ఛగా జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు అని ఆదివారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడితప్పాయి. 8 నెలల్లో 500 హత్యలు జరిగాయని నేను అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మరునాడే హైదరాబాద్‌లో రెండు హత్యలు జరగడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది.
హోంశాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో జరుగుతున్న నేరాలపై ఇంతవరకు పోలీసులతో సమీక్ష నిర్వహించలేదు. ప్రభుత్వ ప్రాధాన్యాల్లో లా అండ్ ఆర్డర్ లేకపోవడం బాధాకరం. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ సహా తెలంగాణలో నెలకొల్పిన శాంతి భద్రతల కారణంగా వేలకోట్ల పెట్టుబడులు రాష్ర్టానికి వచ్చాయి. సీఎం రాజకీయాలకు అతీతంగా స్పందించి, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పడంపై దృష్టి సారించాలని కోరుతున్నా’ అని పేర్కొన్నారు.