హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): 20 ఏండ్లుగా ముప్పుతిప్పలు పెడుతున్న ఓ నిందితుడిని సీబీఐ ఎట్టకేలకు పట్టుకుంది. తమిళనాడులోని ఓ కుగ్రామంలో నిందితుడు చలపతిరావును అదుపులోకి తీసుకుంది. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్‌లోని చందులాల్ బారాదరి ఎస్బీఐ బ్రాంచ్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న వీ చలపతిరావు తన స్నేహితులు, కుటుంబసభ్యుల పేరిట నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి రూ.50 లక్షలు వాడుకున్నాడు. ఆ తర్వాత మోసాన్ని గుర్తించిన బ్యాంకు అధికారులు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో 2002 మే 1న కేసు ఫైల్ అయ్యింది. 2004 నుంచి చలపతిరావు అదృశ్యమయ్యాడు. ఈ కేసులో అతడి భార్యపై కూడా సీఐబీ కేసు నమోదు చేసింది. ఏడేండ్ల తర్వాత తన భర్త చనిపోయినట్టు ప్రకటించాలని కోరుతూ హైదరాబాద్ సివిల్‌కోర్టులో చలపతిరావు భార్య పిటిషన్ దాఖలు చేయడంలో వారు ఆర్డర్ ఇచ్చారు. దీంతో సీబీఐ ప్రొైక్లెమెడ్ అఫెండర్ (పీఓ)గా ప్రకటించింది. చలపతిరావు ఆస్తిని జప్తు చేసేందుకు సీబీఐ ప్రయత్నించగా, అతడి భార్య హైకోర్టు నుంచి స్టే తెచ్చుకుంది.
అవతారాలు మార్చుతూ..
2007లో తమిళనాడులోని సేలం పారిపోయిన చలపతిరావు అక్కడ వినీత్కుమార్గా పేరు మార్చుకున్నాడు. ఓ మహిళను పెండ్లి చేసుకొని, ఆధార్ కార్డు కూడా సంపాదించాడు. మొదటి భార్యతో మాత్రం కాంటాక్ట్‌లోనే ఉన్నాడు. ఆ తర్వాత 2014లో భోపాల్ పారిపోయాడు. అక్కడ లోన్ రికవరీ ఏజెంట్‌గా పనిచేశాడు. 2016లో ఉత్తరాఖండ్‌లోని రుద్రాపూర్‌కు వెళ్లి అకడ సూల్ టీచర్‌గా పనిచేశాడు. అక్కడ్నుంచి 2016లో పారిపోయాడు. ఆ తర్వాత ఔరంగాబాద్‌లోని వేరుల్ గ్రామంలో ఓ ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ తన పేరును స్వామి విధితాత్మానంద తీర్థగా మార్చుకొని ఆధార్ కార్డు కూడా పొందాడు. 2021 డిసెంబర్లో ఆశ్రమాన్ని విడిచిపెట్టి, రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌కు మకాం మార్చాడు. ఈ ఏడాది జూలై 8 వరకు అకడే ఉన్నాడు. అక్కడి నుంచి సముద్రమార్గం ద్వారా శ్రీలంక వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే తిరునెల్వేలికి చేరుకున్నాడు. అక్కడికి సమీపంలోని నర్సింగనల్లూర్ గ్రామంలో సీబీఐ ఆయనను అదుపులోకి తీసుకుంది. అతడికి ఈనెల 16 వరకు సీబీఐ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. కేసు పునఃప్రారంభించి, విచారణ చేపడుతున్నట్టు సీబీఐ తెలిపింది.