హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ) : జనగణనతోపాటు కులగణన కూడా చేపట్టనున్నట్టు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. దానిని మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో చూపాలని బీఆర్ఎస్ మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు దక్కితేనే బడుగు బలహీనవర్గాలకు సంపూర్ణ న్యాయం జరిగినట్టవుతుందని తెలిపారు. విద్యాఉద్యోగాల్లో కూడా బీసీలకు 50% రిజర్వేషన్లు అమలుచేసి తీరాలని డిమాండ్ చేశారు. బీసీల కోసం కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏ ర్పాటు చేయాలని కోరారు.
బీసీల కులగణన అంశంపై తొలుత మాట్లాడింది బీఆర్ఎస్సేనని, 2014లోనే పార్టీ అధినేత కేసీఆర్ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల అమలుకోసం తీర్మానం చేసి, కేంద్రానికి ప్రతిపాదన పంపిన విషయాన్ని గుర్తుచేశారు. కులగణన చేయాలని 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని చెప్పారు. బీసీల జనాభా దామాషా ప్రకారం సీఎం రేవంత్ మంత్రి పదవులు, కార్పొరేషన్ల చైర్మన్ పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ వల్లే బీసీగణనపై కేంద్రం దిగివచ్చిందని సీఎం రేవంత్ చంకలు గుద్దుకుంటున్నారని, కానీ, యూపీఏ సర్కారు హ యాంలోనే కేసీఆర్ నాటి ప్రధానిపై ఒత్తిడి తెచ్చినట్టు మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ పేర్కొన్నారు. కేసీఆర్ కులవృత్తులను కాపాడితే.. సీఎం రేవంత్ మాత్రం బీసీ పథకాలను నిలిపివేశారని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ దుయ్యబట్టారు.