హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాలకు బియ్యం అమ్మేందుకు నిరాకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ప్రైవేటు వ్యాపారులకు విక్రయించేందుకు మాత్రం రంగం సిద్ధం చేసింది. నిన్నమొన్నటి వరకు ఓపెన్ మార్కెట్ సేల్ స్కీం (ఓఎంఎస్)లో భాగంగా ఇటు ప్రైవేటుకు, అటు ప్రభుత్వాలకు బియ్యం, గోధుమలు విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇప్పుడు కేవలం ప్రైవేటు వ్యాపారులకు మాత్రమే విక్రయించేందుకు అంగీకరించింది. 15 లక్షల టన్నుల బియ్యం, గోధుమలను విక్రయిస్తామని ప్రకటించింది. తొలిదశలో ఈ నెల 28న 4 లక్షల టన్నుల గోధుమలను విక్రయించనున్నది. జూలై 5న 5 లక్షల టన్నుల బియ్యం బహిరంగ మార్కెట్లోకి విడుదల చేయనున్నది. ధరలను నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ఎఫ్సీఐ సీఎండీ అశోక్ కుమార్ మీనా ప్రకటించారు. అయితే, సబ్సిడీ కింద ఒకటి రెండు రూపాయలకే కిలో చొప్పున పేదలకు ఇస్తున్న రాష్ర్టాలు.. అందుకోసం తమకు బియ్యం, గోధుమలు సరఫరా చేయాలని ఎన్నిసార్లు కోరినా కేంద్రం నిరాకరించటం గమనార్హం. తమిళనాడు, కర్ణాటక, ఏపీ వంటి రాష్ర్టాలు తమకు బియ్యం కావాలని కేంద్రానికి మొరపెట్టుకొంటున్నాయి. అయినప్పటికీ ఆ రాష్ర్టాలకు బియ్యం విక్రయించేందుకు కేంద్రం ససేమిరా అంటున్నది.
బియ్యం, గోధుమల వేలం ప్రక్రియలో రాష్ర్టాలు పాల్గొనకుండా కేంద్రం నిషేధం విధించింది. ప్రైవేటు వ్యాపారులు మాత్రమే వేలంలో పాల్గొనాలని తేల్చి చెప్పింది. రాష్ర్టాలకు నేరుగా విక్రయించకుండా వేధిస్తున్న కేంద్రం.. ఇప్పుడు బహిరంగ వేలంలో కొనుక్కొనేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా రాజకీయ క్రీడకు తెరలేపింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రాష్ర్టాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తాము ధర వెచ్చించి కొనుగోలు చేస్తామన్నప్పటికీ అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరితో అనేక రాష్ర్టాల్లోని పేదల ఆకలి తీర్చలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు బియ్యం కనీస ధరను రూ. 3,100గా నిర్ణయించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం క్వింటాలుకు రూ.3,400 వరకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయినా బియ్యం ఇవ్వకుండా పేదల ఆకలితో కేంద్రం చెలగాటమాడుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.