హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : గురుకులాల్లో ఇప్పటివరకు 48 మంది విద్యార్థులు మరణించారని, అవి సాధారణ మరణాలు కావని, ప్రభుత్వ హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. నిమ్స్‌లో 20 రోజులపాటు మృత్యువుతో పోరాడి చనిపోయిన వాంకిడి విద్యార్థి శైలజతోపాటు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో వివిధ కారణాలతో చనిపోయిన 48 మంది విద్యార్థుల కుటుంబాలకు బీఆర్ఎస్ తరఫున ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నట్టు చెప్పారు. ‘ప్రభుత్వమే అన్నీఅయి చూసుకుటుందని తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులాలకు పంపిస్తే, ఈ సర్కారు 48 మంది పేద పిల్లలను పొట్టన బెట్టుకున్నది. ఇవి మామూలు మరణాలు కాదు.. ప్రభుత్వ హత్యలే.. ఈ విషయాన్ని ఇకడితో వదిలేయం.. మృతుల కుటుంబాల తరఫున శాసనసభలో ప్రభుత్వాన్ని నిలదీస్తం. చీల్చి చెండాడుతం’ అని స్పష్టంచేశారు. సిరిసిల్ల నియోజకవర్గం కోరుట్లపేటలో ఓ విద్యార్థి గురుకుల పాఠశాలలో చనిపోతే ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు ఆ తల్లితండ్రులు తమ లాంటి కడుపుకోత వేరేవాళ్లకు రాకుండా పోరాడాలని కోరారని గుర్తుచేశారు. ఇప్పటి వరకు గురుకులాల దుస్థితిపై సీఎం ఒక సమీక్ష కూడా చేయలేదని మండిపడ్డారు. అంశాలన్నింటిపైనా అసెంబ్లీలో సర్కార్‌ను నిలదీస్తామని, చీల్చిచెండాడుతామని చెప్పారు. కష్టాలు వచ్చినయని విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దని, నిబ్బరంగా ఉండాలని సూచించారు. ఆరోగ్యం బాగాలేకపోతే బీఆర్ఎస్ నేతలను సంప్రదించాలని, ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించి మెరుగైన చికిత్స అందిస్తామని పిల్లలకు హామీ ఇచ్చారు.