హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): ఆలయ భూముల పరిరక్షణలో భాగంగా రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో 48 ఎకరాలకు పైగా ఆలయ భూములు, ఇతర ఆస్తులను ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు దేవాదాయశాఖ ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న భూములకు ఫెన్సింగ్ ఏర్పాటుచేయడంతోపాటు సైన్బోర్డులను కూడా నెలకొల్పినట్లు అధికారులు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు దేవాదాయ భూములను దేవుడి భూములుగా ప్రకటించి వాటి క్రయవిక్రయాలపై పూర్తి నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అన్యాక్రాంతమైన భూములను కాపాడేందుకు ప్రత్యేక డ్రైవ్ కూడా చేపట్టింది. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అనంతారంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయానికి చెందిన 16.29 ఎకరాలు, రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్లోని రంగనాయకస్వామి ఆలయానికి చెందిన షాబాద్ మండలం మన్నిమర్రి గ్రామం సర్వే నంబర్-280లోని 5.03ఎకరాలు, కడ్తాల్ చెన్నకేశ్వరస్వామి ఆలయానికి చెందిన సర్వే నంబర్లు 120, 125, 130లోని 26.21ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్టు దేవాదాయశాఖ వెల్లడించింది.