హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో 46 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేసినట్టు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు వెల్లడించారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో పోలీసులు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్త కమీషనరేట్ల ఏర్పాటు, ఆరోగ్య భద్రత పథకాన్ని కేసీఆర్ అమలుపర్చారని గుర్తుచేశారు. పోలీసులకు సంబంధించి ఏడు టీఏలు, మూడు సరెండర్ లీవులు, ఐదు డీఏలు పెండింగ్ ఉన్నాయని పేర్కొన్నారు.
పోలీసుల భద్రత పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ లక్షకు పరిమితం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగూడెం జిల్లాలో 72 టీఏలు పెండింగ్ ఉన్నాయని, కొన్ని జిల్లాల్లో టీఏలు ఇచ్చి మరికొన్ని జిల్లాల్లో పెండింగ్ పెట్టడమేంటని ప్రశ్నించారు. పోలీస్‌శాఖ ముఖ్యమంత్రి వద్ద ఉన్నా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల సంక్షేమానికి గత ఏడాదితో పోలిస్తే రూ.400 కోట్లను తగ్గించారని పేర్కొన్నారు. పెంచాల్సిన బడ్జెట్ ఎందుకు తగ్గిందో చెప్పాల్సిన మంత్రి, ఎలాంటి హామీ ఇవ్వడం లేదని మండిపడ్డారు.
బీసీలకు బడ్జెట్లో రూ.20వేల కోట్లు పెడతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, గత రెండు బడ్జెట్లలో పెట్టలేదని, తాజా బడ్జెట్లోనైనా బీసీలకు రూ.20వేల కోట్లు కేటాయించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో బీసీ సంక్షేమం, ఆర్టీసీపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటామని చెప్పి కాంగ్రెస్ బీసీల ఓట్లు కొల్లగొట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.80 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్ల టెండర్లు పిలిచారని, అందులో బీసీలకు ఎన్ని ఇచ్చారో చెప్పాలని గంగుల డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలను నిర్మించకపోవడంతో నియోపొలిస్ వద్ద భారీ భవనాలకు సంబంధించిన నిర్మాణ వ్యర్థాలు పెద్దఎత్తున చేరుకుంటుంన్నాయని గంగుల ఆరోపించారు. నిర్మాణ వ్యర్థాలు తొలగించేందుకు రూ.20-25 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ సెకండ్ ఫేజ్ నిధులు విడుదల చేయాలని కోరారు. ఆర్టీసీ చైర్మన్‌గా బీసీ వ్యక్తిని నియమించాలని డిమాండ్ చేశారు.
పోలీసులు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. పోలీసుల టీఏలు, డీఏలు, సరెండర్ లీవులు విడుదల చేయకపోవడం, ఆరోగ్య భద్రతా పథకం, పోలీస్‌శాఖలో 17వేల ఖాళీల భర్తీపై సమాధానం చెప్పకపోవడంతో బీఆర్ఎస్ వాకౌట్ చేస్తున్నట్టు అసెంబ్లీలో హరీశ్‌రావు ప్రకటించారు. బీసీల ఆత్మగౌరవ భవనాల విషయంలో స్పష్టత, బీసీ సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపు, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ ఉద్యోగుల అపాయింట్ డేట్ చెప్పనందుకు వాకౌట్ చేస్తున్నట్టు చెప్పారు.